4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం
close

ప్రధానాంశాలు

Updated : 05/01/2021 06:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం

కేరళ, హిమాచల్‌కూ పాకిన వైరస్‌

శిమ్లా, జైపుర్‌, కొట్టాయం: కరోనాతో ఇప్పటికే దేశం సతమతమవుతుంటే.. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ క్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకుతోంది. తాజాగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో ఈ వైరస్‌ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య నాలుగుకు చేరింది. కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల ఈ రెండు జిల్లాల్లో అనేక బాతులు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. వాటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపించారు. ఇందులో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న బాతులు, కోళ్లు వంటి 40 వేలకు పైగా పక్షులను చంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఈ వైరస్‌ సోకే ప్రమాదమున్న నేపథ్యంలో కొట్టాయం, అలప్పుజ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
వలస పక్షుల మృత్యువాత
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్‌ డ్యామ్‌ లేక్‌లో వలస పక్షులు(బాతులు) బర్డ్‌ఫ్లూ బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు. సరస్సు అభయారణ్యంలో దాదాపు 1800 వలస పక్షులు ఈ వైరస్‌ కారణంగా చనిపోయినట్లు తెలిపారు. పక్షుల నమూనాలను బరేలీలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపగా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో మరో 170 పక్షులు
మరోవైపు రాజస్థాన్‌లో సోమవారం 170 వరకు పక్షులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ఇటీవల ఈ రాష్ట్రంలో 425 పక్షలు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మృత్యువాత పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకులు  మృతి చెందిన ఝలావర్‌, బరన్‌, కోటా, పాలి, జోధ్‌పుర్‌, జైపుర్‌ తదితర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. పశు సంవర్థక శాఖ కార్యదర్శి కుంజిలాల్‌ మీనా అత్యవసర సమావేశం నిర్వహించారు. కోళ్ల ఫారమ్‌ యాజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోనూ ఇటీవల కొన్ని చోట్ల ఈ వైరస్‌ వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోర్‌లో పలు కాకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. ఈ కారణంగా ఇండోర్‌, మాంద్‌సౌర్‌, అగర్‌-మాల్వ, ఖార్గావ్‌, సెహోర్‌ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన