టాక్‌ షో దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 24/01/2021 05:16 IST

టాక్‌ షో దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బ్రాడ్‌కాస్టింగ్‌ దిగ్గజం ల్యారీ కింగ్‌(87) శనివారం ఉదయం కన్నుమూశారు. లాస్‌ ఏంజెలిస్‌లోని సీడర్స్‌-సైనై మెడికల్‌ సెంటర్‌లో కింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు చెందిన ఓరా మీడియా ట్విట్టర్‌లో తెలిపింది. ఆయన మృతికి కారణాలు వెల్లడించనప్పటికీ.. కొవిడ్‌-19తో కింగ్‌ వారానికి పైగా ఆసుపత్రిలో ఉన్నట్లు ఇటీవల సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ తెలిపింది. ఆయన చాలాకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలొచ్చాయి. 6 దశాబ్దాలకు పైగా ఆయన రేడియో, టెలివిజన్‌, డిజిటల్‌ మీడియాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. సీఎన్‌ఎన్‌, ఇతర వార్తాసంస్థల తరఫున ఎంతోమంది ప్రపంచస్థాయి నేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. గెరాల్డ్‌ ఫోర్డ్‌ నుంచి బరాక్‌ ఒబామా వరకు సిటింగ్‌ అమెరికా అధ్యక్షులందరినీ ఇంటర్వ్యూ చేశారు.  ఆయన ఇంటర్వ్యూ చేసిన వారిలో యాసర్‌ ఆరాఫత్‌, దలైలామా, మైఖేల్‌ గోర్బచేవ్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, బిల్‌ గేట్స్‌, లేడీ గాగా, ఎలిజబెత్‌ టేలర్‌ వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఎన్నో చర్చా కార్యాక్రమాలను నిర్వహించిన ఆయన తనదైన శైలిలో ప్రశ్నించి ఆసక్తికర సమాధానాలు రాబట్టేవారు. ఆయన ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. కింగ్‌ వేల సంఖ్యలో ఆన్‌-ఎయిర్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. పత్రికల్లో కాలమ్స్‌ కూడా రాసేవారు. సీఎన్‌ఎన్‌లో చేరిన తర్వాత అనేక ప్రజాదరణ పొందిన పుస్తకాలు రాశారు. 2009లో తన జీవితకథ ‘మై రిమార్క్‌బుల్‌ జర్నీ’ కూడా రాశారు. ఆయనకు గతంలో గుండెపోటు రాగా అనంతరం హృద్రోగాలపై ఓ పుస్తకం రాశారు. 2010లో ఆయన తన వృత్తి నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించారు. 2011లో జీవితకాల సాఫల్యం కింద ఎమ్మీ అవార్డు సాధించారు. రేడియో, కేబుల్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా కూడా గతంలో ఎంపికయ్యారు. 10 కేబుల్‌ ఏస్‌ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు పొందారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన