close

ప్రధానాంశాలు

Updated : 27/01/2021 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏమార్చి.. వ్యూహం మార్చి..

బలగాలను ఉక్కిరిబిక్కిరి చేసిన రైతులు
ఆందోళనతో దిల్లీ అష్ట దిగ్బంధం
ఈనాడు - దిల్లీ

మూడు సాగు చట్టాలను రద్దుచేయాలన్న డిమాండ్‌తో గత నవంబర్‌ నుంచి సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతన్నలు.. పోలీసు ఆంక్షలను దాటి ఎర్రకోటను వ్యూహాత్మకంగా ముట్టడించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొనేందుకు వారు ప్రయత్నం చేశారన్న విమర్శలు ఒకవైపు వినిపిస్తుంటే, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జి చేసి రెచ్చగొట్టింది పోలీసులేనని అన్నదాతలు ప్రత్యారోపణలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సంఘటనలను బట్టి.. పరిస్థితి ట్రాక్టర్‌ ర్యాలీ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న నేతల చేతులు దాటిపోయిందన్న భావన ఒక దశలో వ్యక్తమైంది.

రెండు నెలలుగా పోరాడుతున్నా వినిపించుకోని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గణతంత్ర దినోత్సవం నాడు కిసాన్‌ కవాతు నిర్వహించాలని నిర్ణయించిన రైతులు దానికి పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నారు. రైతు సంఘాల నేతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పంజాబ్‌, హరియాణాల నుంచి పెద్దఎత్తున రైతులు నిర్ణీత సమయం కంటే రెండు గంటల ముందుగా.. ఉదయం 8 గంటలకే ట్రాక్టర్లతో, ఇతర వాహనాలతో, గుర్రాలతో చేరుకున్నారు. చాలామంది కాలినడకన వచ్చేశారు. ర్యాలీ ప్రారంభించిన తర్వాత వారు తమకు కేటాయించిన మార్గం నుంచి తప్పుకొని ఎర్రకోటకు వచ్చి అక్కడ ఆందోళన మొదలుపెట్టారు. వేలమంది పోగయ్యారు. ఉత్సాహవంతులైన కొందరు యువకులు ఎర్రకోట బురుజులపైకి ఎక్కి సిక్కు మత జెండా ఎగరేశారు. తర్వాత ఎర్రకోటను ఆక్రమించినట్లుగా అంతటా విస్తరించారు. మధ్యాహ్నం మూడు గంటలవరకు ఆందోళనకారులు అక్కడే ఉండిపోయారు. రైతులను నియంత్రించేంత స్థాయిలో బలగాలు లేకపోవడంతో తొలుత పోలీసులు వారిని ఏమీ అనలేదు. మూడు గంటల తర్వాత తగిన బలగాలను మోహరించి లాఠీలను ఝళిపిస్తూ అక్కడినుంచి తరిమేశారు. దాంతో రైతులు ట్రాక్టర్లతో రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు.

యుద్ధ వాతావరణంలో ఘర్షణ
రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌డే కవాతు పూర్తయిన తర్వాతే రైతుల ర్యాలీ జరగాల్సి ఉండగా వారు మాత్రం ఉదయం ముందుగానే టిక్రీ, సింఘు, ఘాజీపుర్‌ సరిహద్దుల ద్వారా దేశ రాజధానిలోకి ప్రవేశించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఐటీఓ సమీపంలో ఓ ఆందోళనకారుడి మరణానికి పోలీసు కాల్పులు కారణమని ప్రచారం జరిగింది. ఆ వార్తలను పోలీసులు ఖండించారు. ఎర్రకోట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంవల్లే సదరు వ్యక్తి చనిపోయినట్లు చెప్పారు. 

దిల్లీ వాసులకు ట్రాఫిక్‌ చిక్కులు
దిల్లీ: రైతుల గణతంత్ర కవాతు మంగళవారం దేశ రాజధాని దిల్లీ వాసులను తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులకు గురిచేసింది. ర్యాలీ నిర్దేశించిన సమయం కన్నా చాలా ముందే ప్రారంభం కావడం, కేటాయించని మార్గాల్లోకీ ట్రాక్టర్లతో ప్రవేశించడం పలు ప్రాంతాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పలు కూడళ్లలో పోలీసులు, నిరసనకారులు ఘర్షణ పడటం కూడా రాజధానివాసుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ముఖ్యంగా ఐటీఓ, ఎర్రకోట ప్రాంతాల్లో పరిస్థితి అదుపుతప్పింది. నిరసనకారులను నిరోధించడం కోసం కొన్ని మార్గాల్లో బ్యారికేడ్లను పోలీసులు నిర్మించారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ప్రజల రవాణాకు ఆటంకం కలిగించాయి.


ఖాళీ చేయం.. ఇక దిల్లీ నడిబొడ్డునే ఉంటాం..

హింసాత్మక ఘటనలను రైతుసంఘాల నేతలు ఖండించినప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులు మాత్రం తమ ఉద్యమ స్థలం ఇక మీదట దిల్లీ సరిహద్దుల నుంచి రాజధాని నడిబొడ్డుకు మారిందన్నారు. ఇక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితే లేదని ప్రకటించారు. నవంబర్‌లో తాము దిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇప్పుడు వారి బారికేడ్లను బద్దలు కొట్టుకొని నగరంలోకి వచ్చినందున ఇక ఇక్కడినుంచే ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.  


ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి
పౌరహక్కుల సంఘం డిమాండ్‌

ఈనాడు, దిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. రైతులు మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ల ప్రదర్శనకు సంఘీభావం తెలిపారు. ఉద్యమ తీరుతెన్నులపై భగత్‌సింగ్‌ మేనల్లుడు, ప్రొఫెసర్‌ జగ్మోహన్‌సింగ్‌తో పాటు పలువురు రైతు సంఘం నాయకులతో వారు మాట్లాడారు.మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నాయకులు చిలుకా చంద్రశేఖర్‌, ఎన్‌.నారాయణరావు, మాదన కుమారస్వామి, జి.ఏ.వి.ప్రసాద్‌, బొడ్డుపల్లి రవి, పోగుల రాజేశం, కడ రాజయ్య, వెంకట్‌ పాల్గొన్నారు.


శాంతియుత ఉద్యమంలో అశాంతి పర్వం
రైతు కవాతు హింసాత్మకంగా మారిన క్రమం ఇదీ..

దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా రైతు సంఘాలు దిల్లీలో చేపట్టిన గణతంత్ర కవాతు మంగళవారం ఉదయం నుంచే తీవ్ర గందరగోళానికి గురైంది. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాతే మధ్యాహ్నం 12 గంటలకు రైతుల ట్రాక్టర్ల కవాతు ప్రారంభమవుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. సెంట్రల్‌ దిల్లీలోకి ప్రదర్శన వెళ్లబోదనీ స్పష్టంచేసింది. అయితే, దీనికి పూర్తి విరుద్ధంగా మంగళవారం ఉదయం నుంచే ర్యాలీలు ప్రారంభమయ్యాయి. రైతుల ర్యాలీ హింసాత్మకంగా మారిన ఘటనల క్రమం ఇదీ...

ఉదయం 7.00-9.30
సింఘు, టిక్రీ, గాజీపుర్‌ల వద్దకు చేరుకున్న వేల మంది రైతులు దిల్లీ నగరంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. ఈ క్రమంలో టిక్రీ, సింఘు సరిహద్దుల వద్ద ఉన్న బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. హింసాత్మక ఘటనలను ఖండించారు.

ఉదయం 10.00
సంజయ్‌ గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ వద్ద దిల్లీ పోలీసులతో నిరసనకారుల ఘర్షణ. భాష్పవాయు గోళాల ప్రయోగం.

ఉదయం 10.30
అక్షరధామ్‌ కూడలి వద్ద పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ. రహదారిపై నిలిపి ఉంచిన వాహనాలతో పాటు డీటీసీ బస్సుల ధ్వంసం.

ఉదయం 11.00
భాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో పాటు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కృపాణాలు చేతపట్టిన కొందరు రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ల కవాతుకు నిర్దేశించిన మార్గాన్ని వీడి సరై కలే ఖాన్‌ వైపునకు బయలుదేరారు.

మధ్యాహ్నం 12.00
ముకర్బా చౌక్‌ వద్ద పోలీసులతో రైతులు మళ్లీ ఘర్షణకు దిగారు. సెంట్రల్‌ దిల్లీలోని ఐటీఓ కూడలికి చేరుకున్న నిరసనకారులు వాహనాలను, డీటీసీ బస్సులను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులను ట్రాక్టర్లతో వెంబడిస్తూ ఎర్రకోట వైపునకు మళ్లారు. వందల మంది నిరసనకారులు ట్రాక్టర్లు, బైకులు, కార్లలో ఎర్రకోట ప్రాంగణంలోకి చేరుకున్నారు. సిక్కు మత చిహ్నాలున్న త్రికోణ ఆకృతిలోని కాషాయ పతాకాన్ని, రైతు సంఘం జెండాను ఎగురవేశారు.

మధ్యాహ్నం 1.00
ట్రాక్టర్‌ నడుపుతున్న నవనీత్‌ సింగ్‌ మృతి. అతని వాహనం పల్టీకొట్టడం వల్లే మృతి చెందారని పోలీసులు చెబుతుండగా.... సాయుధులైన భద్రతా సిబ్బందే కాల్చి చంపారని రైతులు ఆరోపించారు. మృతదేహంతో ఐటీఓ వద్ద నిరసనకారులు బైఠాయించారు. ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించిన పోలీసులు...నిరసనకారులు ఎగురవేసిన జెండాలను తొలగించేందుకు ప్రయత్నించారు.

మధ్యాహ్నం  2.30
ఐటీవో కూడలి, ఎర్రకోట ప్రాంగణం వద్ద పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ. రాళ్లు విసిరిన ఘటనలూ చోటుచేసుకున్నాయి.

మధ్యాహ్నం  3.00
లాఠీలు ఝుళిపిస్తూ ఎర్రకోట ప్రాంగణం నుంచి రైతులను పోలీసులు తరిమివేశారు. సింఘు, టిక్రీ, గాజీపుర్‌ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన