ఒక్క లోపముంటే చెప్పండి

ప్రధానాంశాలు

Updated : 06/02/2021 13:52 IST

ఒక్క లోపముంటే చెప్పండి

వ్యవసాయ చట్టాలపై మంత్రి తోమర్‌ ప్రశ్న రద్దు చేయాల్సిందే.. తప్పదన్న ప్రతిపక్షాలు

దిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరోమారు గట్టిగా సమర్థించుకొంది. శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ చట్టాల్లో ఉన్న ఒక్క లోపాన్ని కూడా ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయని విమర్శించారు. రైతుల మనోభావాలను గుర్తించి చట్టాల్లో సవరణలు చేస్తామని చెప్పామని, దానర్థం వాటిలో లోపాలు ఉన్నట్టు కాదని వివరణ ఇచ్చారు. ‘‘వీటిని నల్ల చట్టాలని అంటున్నారు. వీటిలోని నల్లదనం ఎక్కడ ఉందో చెప్పాలని గత రెండు నెలలుగా అడుగుతున్నా. నాకు సమాధానం రావడం లేదు’’ అని చెప్పారు. రైతుల భూములను వ్యాపారాలు లాక్కొనే నిబంధన కాంట్రాక్టు వ్యవసాయ చట్టంలో ఎక్కడుందో చెప్పాలని అడిగారు. మార్కెట్‌ యార్డులు విధించే పన్నులను రద్దు చేశామని, అయినా సమ్మె ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని అన్నారు. అందరూ నీటితో వ్యవసాయం చేస్తే కాంగ్రెస్‌ రక్తంతో చేస్తుందని ఆరోపించారు. రైతుల ఆదాయం పెంపు కోసమే ఈ సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు.

అవి మరణశాసనాలు

కాంగ్రెస్‌ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా మాట్లాడుతూ ఈ మూడు వ్యవసాయ చట్టాలు మరణశాసనాలని అన్నారు. సిక్కులను ఖలిస్థాన్‌ తీవ్రవాదులన్న ముద్రవేయడాన్ని తప్పుపట్టారు. ప్రతి నెలా ఓ సిక్కు సైనికుడి శవం త్రివర్ణ పతాకంలో వస్తోందని అన్నారు. మరో సభ్యుడు ఆనంద్‌ శర్మ ప్రసంగిస్తూ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 194 మంది రైతులకు నివాళులు అర్పించారు. ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేశారు. సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మద్దతు ధరపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. మద్దతు ధరకు అదనంగా బోనస్‌ ఇస్తే పంటలు కొనుగోలు చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపిందని తెలిపారు.

నిజాలు చెప్పేవారు దేశద్రోహులా?

శివసేన సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ప్రంసగిస్తూ నిజాలు చెప్పేవారిపై దేశద్రోహులన్న ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసిన సిక్కులపై దేశద్రోహులన్న ముద్ర వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎర్రకోట అలర్లలో ప్రమేయం ఉన్న దీప్‌ సిద్ధూను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ సభ్యుడు కె.సి.వేణుగోపాల్‌, సీపీఐ సభ్యుడు బినయ్‌ విశ్వం అడిగిన ప్రశ్నకు మంత్రి తోమర్‌ సమాధానమిస్తూ చట్టాల రూపకల్పనలో నిబంధనలు పాటించామని, రాష్ట్రాలతో చర్చించామని తెలిపారు.

8న మోదీ ప్రసంగం

రాజ్యసభలో ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ చట్టాలపై ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 8 నుంచి 12 వరకు తప్పనిసరిగా సభలో ఉండాలని భాజపా విప్‌ జారీ చేసింది. రాజ్యసభలో తోమర్‌ వ్యవసాయ చట్టాలపై అన్ని విషయాలూ చెప్పారని మోదీ ట్వీట్‌ చేశారు. అందరూ వినాలంటూ ఆయన ప్రసంగం వీడియోను జత చేశారు.

లోక్‌సభ మళ్లీ వాయిదా

సాగు చట్టాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో శుక్రవారం వరుసగా నాలుగోరోజు కూడా లోక్‌సభలో ఎలాంటి చర్చలూ జరగలేదు. కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాల సభ్యులు సభామధ్యంలోకి వెళ్లి నినాదాలు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన