భారత చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రధానాంశాలు

Published : 12/02/2021 04:58 IST

భారత చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరిక

దిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలు భారత దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌తో కొన్ని ఖాతాల నిలిపివేతపై వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెచ్చగొట్టే సందేశాలుగా భావిస్తున్న సమాచారాన్ని నిలువరించే విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అమలుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఆయన తన స్వర తీవ్రతను పెంచారు. సామాజిక మాధ్యమ వేదికలు అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌, భారత్‌లోని ఎర్రకోట ఘటనల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని తెలిపారు. మీడియా స్వేచ్ఛకు, వ్యక్తుల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ‘శత్రుత్వ భావన, హింస, దుష్ప్రచారాలను వ్యాప్తి చేయవద్దు. భారత రాజ్యాంగాన్ని, ఇక్కడి చట్టాలను అనుసరించండి’ అని సామాజిక మాధ్యమ వేదికలను ఉద్దేశించి మంత్రి నొక్కి చెప్పారు. ఉద్రేకపూరిత సందేశాలను కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమ వేదికలు స్వీయ నియంత్రణ యంత్రాంగాలను కలిగి ఉన్నంత మాత్రాన భారత దేశ నిబంధనలను పాటించ వద్దన్నది దాని అర్థం కాదని పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన