close

ప్రధానాంశాలు

Updated : 23/02/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

27న రైతుల భారీ కవాతు

బర్నాలా: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల బైఠాయింపు ప్రారంభమై మూడు నెలలు పూర్తికావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న భారీ కవాతు చేపట్టాలని కర్షక సంఘాలు నిర్ణయించాయి. పంజాబ్‌ నుంచి దిల్లీ సరిహద్దుల వరకు నిర్వహించే ఈ కవాతులో రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పంజాబ్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌, భారతీయ కిసాన్‌ యూనియన్‌(ఉగ్రహాన్‌) నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం పంజాబ్‌లోని బర్నాలాలో నిర్వహించిన మహా ర్యాలీ సందర్భంగా రైతు నేతలు ఈ విషయాన్ని ప్రకటించారు. రైతుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందున ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు గురుచరణ్‌ సింగ్‌ హవాస్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.
ప్రభుత్వాలు పడిపోతాయి: టికాయిత్‌
సోనెపత్‌: ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు గద్దె దిగిపోక తప్పదని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ హెచ్చరించారు. హరియాణాలోని సోనెపత్‌లో సోమవారం నిర్వహించిన కిసాన్‌ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. ప్రజలు ఒక చోట గుమిగూడినంత మాత్రాన అది చట్టాల రద్దుకు దారితీయదంటూ ఆదివారం గ్వాలియర్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కొంత మంది గుమిగూడినంత మాత్రాన చట్టాలు రద్దు కావంటూ కేంద్ర మంత్రి తోమర్‌ చేసిన వ్యాఖ్యలు రైతుల్ని అవమానించేలా ఉన్నాయని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) అభిప్రాయపడింది.
రైతు నేతపై హత్యాయత్నం
కురుక్షేత్ర: బీకేయూ హరియాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జస్తేజ్‌ సింగ్‌ సంధుపై సోమవారం హత్యాయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పెహోవా టోల్‌ ప్లాజా వద్ద ధర్నా చేస్తున్న రైతులు కలిసేందుకు జస్తేజ్‌ సింగ్‌ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తూటా ఒకటి కారు అద్దం నుంచి బయటకు దూసుకెళ్లింది.
ఎర్రకోటపైకి ఎక్కిన వ్యక్తి అరెస్టు
గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలోని ఎర్రకోటపైకి ఎక్కినట్లుగా ఆరోపణలున్న జస్‌ప్రీత్‌ సింగ్‌(29)అనే యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.




Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన