close

ప్రధానాంశాలు

Published : 23/02/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలేశ్వర్‌: ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణికి సంబంధించిన నిట్టనిలువు ప్రయోగ వెర్షన్‌ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ సోమవారం రెండు సార్లు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి ఈ ప్రయోగం జరిగింది. నిశ్చల, వెర్టికల్‌ లాంచర్‌ నుంచి క్షిపణిని నింగిలోకి పంపారు.  నౌకా దళ అవసరాల కోసం ఈ అస్త్రాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించింది. చాలా తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుంది. తాజాగా జరిగిన రెండు పరీక్షల్లోనూ ఈ అస్త్రం అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలనూ నేలకూల్చిందని అధికారులు తెలిపారు. కనిష్ఠ, గరిష్ఠ దూరాల్లో దీన్ని పరీక్షించామన్నారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌, ఆర్‌సీఐ తదితర డీఆర్‌డీవో ల్యాబ్‌లు ఈ క్షిపణి రూపకల్పనలో పాలుపంచుకున్నాయని వివరించారు. త్వరలో మరిన్ని పరీక్షలు జరిపి, ఈ అస్త్రాన్ని భారత యుద్ధనౌకల్లో మోహరిస్తామని చెప్పారు. దీనివల్ల నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో బాలేశ్వర్‌ జిల్లా అధికారులు.. ప్రయోగ వేదికకు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల దూరంలోని ఐదు గ్రామాల్లో నివసిస్తున్న 6,322 మందిని సురక్షిత ప్రాంతానికి  తరలించారు. మరోవైపు తాజా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌ రెడ్డి.. శాస్త్రవేత్తలను అభినందించారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన