close

ప్రధానాంశాలు

Updated : 24/02/2021 13:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిశ రవికి బెయిల్‌ మంజూరు

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే జైల్లో పెడతారా?
ఆమెపై ఆరోపణలకు ఆధారాలు బలంగా లేవు
నిందితురాలికి నేర చరిత్ర లేదు
దిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి వ్యాఖ్య

దిల్లీ: పర్యావరణ ఉద్యమకర్త దిశ రవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. టూల్‌కిట్‌ కేసులో అరెస్టై కారాగారంలో ఉన్న ఆమెకు దిల్లీ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. రూ.లక్ష వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తు తీసుకుని ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా టూల్‌కిట్‌ను పంచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు.. ఖలిస్థాన్‌ అనుకూల ఉద్యమకర్తలైన ‘పోయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ (పీజేఎఫ్‌)తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిరూపించే బలమైన ఆధారాలను పోలీసులు సమర్పించలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. వేర్పాటువాద ఆలోచనలతో ఆమెకు సంబంధం ఉందని చెప్పడానికీ ఆధారాల్లేవని చెప్పారు. అరకొర, రేఖామాత్రమైన ఆధారాలను పరిగణనలో తీసుకుని 22 ఏళ్ల యువతికి, అందునా ఎలాంటి ముందస్తు నేర చరిత్ర లేని అమ్మాయికి బెయిల్‌ నిరాకరించడానికి తగిన ప్రాతిపదిక కనిపించడం లేదన్నారు. సమాజంలో బలమైన మూలాలున్న ఆమెను జైల్లో పెట్టడాన్ని తప్పుపట్టారు. టూల్‌కిట్‌ గురించి పోలీసులు చెబుతున్నా దానిని ఉపయోగించి ఆమె హింసకు పిలుపునిచ్చినట్లుగా ఎక్కడా లేదన్నారు.

భిన్నాభిప్రాయం.. తప్పుకాదు
‘‘ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వంపై పౌరుల నిరంతర పరిశీలన ఉంటుందనేది నా నిశ్చితాభిప్రాయం. కేవలం ప్రభుత్వ విధానాలతో విభేదించాలన్న మార్గాన్ని ఎంచుకున్నందుకు పౌరుల్ని కటకటాల వెనుక నెట్టేయడం తగదు. ప్రభుత్వ అహంకారం దెబ్బతిన్నంత మాత్రాన దానికి మందుగా దేశద్రోహ అభియోగం మోపడం సమంజసం కాదు. విభేదించడం, భిన్నాభిప్రాయం ఉండడం, అసమ్మతి తెలపడం, ఆక్షేపించడం అనేవి రాజ్య విధానాల్లో వాస్తవికతను ప్రోది చేసే చట్టబద్ధ సాధనాలు. వివేకవంతులైన, వక్కాణించి చెప్పగల పౌరులు ఉండడం ఆరోగ్యకర, దేదీప్యమాన ప్రజాస్వామ్యానికి సూచిక అనేది నిర్వివాదాంశం. విభేదించే హక్కును రాజ్యాంగంలోని 19వ అధికరణం బలంగా చాటుతోంది. కమ్యూనికేషన్‌కు భౌగోళిక హద్దులేమీ లేవు. సమాచారాన్ని పొందడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సాధానాలను వినియోగించుకునే హక్కు పౌరులకు ఉంది. వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేయడం, అపాయకరం కాని టూల్‌కిట్‌కు ఎడిటర్‌గా ఉండడం తప్పేమీ కాదు’’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. విచారణకు దిశ సహకరించాలని, దర్యాప్తు అధికారులు పిలిచినప్పుడు హాజరు కావాలని ఆదేశించారు. న్యాయస్థాన అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదన్నారు. మంగళవారం రాత్రి దిశను తిహార్‌ కారాగారం నుంచి విడుదల చేశారు. ఆమెను మంగళవారం ఉదయం దిల్లీ పోలీసులు ప్రశ్నించారు. సహ నిందితులు నికత జాకబ్‌, శంతను ములుక్‌తో కలిపి వేర్వేరు కోణాల్లో విచారించారు. కుమార్తెకు బెయిల్‌ లభించడంతో న్యాయవ్యవస్థపై తమ విశ్వాసం మరింత పెరిగిందని దిశ రవి తల్లిదండ్రులు బెంగళూరులో చెప్పారు.
Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన