close

ప్రధానాంశాలు

Updated : 26/02/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీరవ్‌ మోదీని భారత్‌కు పంపాల్సిందే

లండన్‌ కోర్టు తీర్పు

లండన్‌: బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో వజ్రాల వ్యాపారి, 49 ఏళ్ల నీరవ్‌ దీపక్‌ మోదీ (ఎన్‌డీఎం)కి లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు పంపించకూడదంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గురువారం నైరుతి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేటు కోర్టు తిరస్కరించింది. ‘‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించడానికి కుట్ర పన్నారన్న వ్యవహారంలో ఎన్‌డీఎంకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్టు నమ్ముతున్నాం. ఆయన భారత్‌కు వెళ్లి అక్కడి కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉంది’’ అని జడ్జి శామ్యూల్‌ గూజీ వ్యాఖ్యానించారు. మోసం, నగదు అక్రమ చలామణి జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జైలులో ఉండడం వల్ల ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, భారత్‌కు పంపించడానికి ఇది అడ్డంకి కాబోదని పేర్కొన్నారు. ఆయనను ముంబయి ఆర్థర్‌ రోడ్‌లోని సెంట్రల్‌ జైలులో ఉన్న 12వ నెంబరు బ్యారెక్‌కు పంపిస్తే ఆరోగ్యం కుదుటపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను తిరస్కరించారు. ఈ తీర్పు కాపీని హోం మంత్రి ప్రీతి పటేల్‌కు పంపించనున్నారు. ‘భారత్‌-బ్రిటన్‌ అపరాధుల అప్పగింత ఒప్పందం’ ప్రకారం రెండు నెలల్లో మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతాం
నీరవ్‌ను రప్పించే వ్యవహారంపై బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతామని దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇది మిగిలిన ఎగవేతదార్లకు హెచ్చరికలాంటిదని సీబీఐ పేర్కొంది.

చాలా సమయం పడుతుంది : సీబీఐ మాజీ డైరెక్టర్‌

దిల్లీ: నీరవ్‌ మోదీని విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు ఇచ్చిన తీర్పు సానుకూల పరిణామమని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎ.పి.సింగ్‌ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వచ్చేందుకు చాలా సమయమే పడుతుందని తెలిపారు. ఆయన ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడుతూ నీరవ్‌ బ్రిటన్‌లో హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాను కూడా భారత్‌కు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించినా వివిధ నిబంధనల కారణంగా ఇంతవరకు సాధ్యం కాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన