అతి తక్కువ వ్యయంతో అంతర్జాలం

ప్రధానాంశాలు

Published : 30/03/2021 05:08 IST

అతి తక్కువ వ్యయంతో అంతర్జాలం

తీగలు లేకుండానే సేవలు
భారత్‌, అమెరికాల నుంచి పేటెంట్‌ పొందిన ‘గిగా మెష్‌’

ఈనాడు, దిల్లీ: గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు తీగలు లేకుండానే నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను తక్కువ ధరకే అందించేందుకు ఆస్ట్రోమ్‌ అనే అంకుర పరిశ్రమ ‘గిగా మెష్‌’ సాధనాన్ని అభివృద్ధి చేసింది. దానికి భారత్‌, అమెరికాల నుంచి పేటెంట్‌ లభించింది.
భారత్‌ వంటి దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించడం చాలా కష్టం. ఫైబర్‌ వేసేందుకు భారీగా వ్యయమవుతుంది. మారుమూల ప్రాంతాలకు తీగలు లేకుండా (వైర్‌లెస్‌) అంతర్జాల సేవలు అందించడం బ్యాక్‌హాల్‌ సాంకేతికతతోనే సాధ్యం. ప్రస్తుత బ్యాక్‌హాల్‌ టెక్నాలజీతో సరిపడా డేటా వేగం, పరిధి సాధ్యం కావడంలేదు. పైగా దాన్ని  వినియోగంలో తీసుకురావడానికీ చాలా ఖర్చవుతోంది. ఆస్ట్రోమ్‌ అభివృద్ధి చేసిన ‘గిగా మెష్‌’ అనే వైర్‌లెస్‌ సాధనం ఈ ఇబ్బందిని అధిగమిస్తోంది.  

అంకుర పరిశ్రమ నుంచి..
మారుమూల గ్రామాలకు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో నేహా శతక్‌.. అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చారు. ప్రసాద్‌ హెచ్‌.ఎల్‌.భట్‌తో కలిసి ఆమె.. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో ఆస్ట్రోమ్‌ అనే అంకుర పరిశ్రమను ప్రారంభించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగంలోని డీఎస్‌టీ-ఏబీఐ మహిళా అంకుర కార్యక్రమం దీనికి ప్రోత్సాహం లభించింది. 2018లో ఆస్ట్రోమ్‌.. మిల్లీమీటరు వేవ్‌, మల్టీబీమ్‌తో కూడిన ఒక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి మనదేశంతోపాటు అమెరికా నుంచి పేటెంట్‌ లభించింది. ఆ తర్వాత దీన్ని మరింత మెరుగుపరచి గిగా మెష్‌ పేరుతో ఒక సాధనాన్ని ఆస్ట్రోమ్‌ అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయి పరీక్షల్లోనూ ఇది తన సత్తాను రుజువు చేసుకుంది. దీని సాయంతో గ్రామాల్లో నాణ్యమైన, అధికవేగం కలిగిన టెలికం మౌలిక వసతులను.. ప్రస్తుతమున్నదానితో పోలిస్తే ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో సాకారం చేయవచ్చు. గిగా మెష్‌ త్వరలోనే తన సేవలు అందించనుంది. ఇప్పటికే ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇచ్చే ఐటీయూ-ఎస్‌ఎంఈ అవార్డును దక్కించుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన