ఈ నెల మధ్యలో వైరస్‌ ఉగ్రరూపం

ప్రధానాంశాలు

Updated : 03/04/2021 10:36 IST

ఈ నెల మధ్యలో వైరస్‌ ఉగ్రరూపం

ఆ తర్వాత క్రమంగా తగ్గుదల
  శాస్త్రవేత్తల అంచనా

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఈ నెల మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి చేరుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఒక గణిత నమూనా సాయంతో వారు ఈ లెక్కలు కట్టారు. కాన్పుర్‌ ఐఐటీకి చెందిన మణీంద్ర అగర్వాల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందుకోసం వారు ‘సూత్ర’ అనే గణిత నమూనాను ఉపయోగించారు. కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తిపైనా వారు ఇదే నమూనా సాయంతో గతంలో లెక్కలు కట్టారు. గత ఏడాది ఆగస్టులో రోజువారీ కేసులు పెరుగుతాయని, సెప్టెంబర్‌లో అవి గరిష్ఠ స్థాయికి చేరుతాయని, ఈ ఏడాది ఫిబ్రవరికల్లా కేసులు తగ్గిపోతాయని అప్పట్లో తెలిపారు. అదే నమూనా సాయంతో.. ప్రస్తుత కొవిడ్‌ ‘సెకండ్‌ వేవ్‌’ తీరుతెన్నులను తాజాగా అంచనా వేశారు. ‘‘ఈ నెల 15-20 మధ్యలో భారత్‌లో రోజువారీ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు. దీని ప్రకారం చూస్తే చాలా వేగంగా కేసులు పెరిగినట్లే లెక్క. అయితే ఆ తర్వాత.. ఇన్‌ఫెక్షన్ల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుంది. మే నెల చివరినాటికి అనూహ్యంగా ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోవచ్చు’’ అని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. కరోనా సెకెండ్‌ వేవ్‌లో పంజాబ్‌.. మొదట గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని అగర్వాల్‌ తెలిపారు. కొద్దిరోజుల్లోనే అది జరుగుతుందన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య తారస్థాయికి చేరుతుందని చెప్పారు. దేశంలో రెండో ఉద్ధృతి తీరుతెన్నులపై హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన గౌతమ్‌ మేనన్‌ సహా పలువురు శాస్త్రవేత్తలు విడిగా వేసిన లెక్కల్లోనూ ఇదే ఫలితం వచ్చింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన