కరోనాపై యుద్ధం కాదు...పోలీసులతో కొట్లాట

ప్రధానాంశాలు

Updated : 03/04/2021 10:15 IST

కరోనాపై యుద్ధం కాదు...పోలీసులతో కొట్లాట

ఏప్రిల్‌ ఫూల్‌ రోజున వికటించిన ‘పార్టీ’

బ్రసెల్స్‌: కరోనా మహమ్మారిపై యుద్ధం మాట ఎలా ఉన్నా, దీని పేరున బెల్జియంలో పోలీసులు, ప్రజలు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. డజన్ల కొద్దీ ప్రజలు, పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. 22 మందిని అరెస్టు చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా నలుగురికి మించి గుమికూడదన్నది ప్రభుత్వ నిబంధన కాగా, దాన్ని ఉల్లంఘించారన్నదే ఈ ఘర్షణలకు కారణం. బ్రసెల్స్‌లోని పార్కులో గురువారం ‘లా బౌమ్‌’ పేరిట పార్టీ జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ కావడంతో ఏప్రిల్‌ఫూల్‌ పేరుతో ఆటపట్టించడానికి ఎవరో చేసిన తప్పుడు ప్రచారమని, అలాంటి కార్యక్రమం ఏదీ లేదని పోలీసులు తెలిపారు. అయినా పట్టించుకోకుండా దాదాపు రెండువేల మంది పార్కుకు చేరారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండడంతో సందడి చేయాలని అనుకున్నారు. ఇందుకు పోలీసులు అంగీకరించలేదు. దాంతో వారిపై నీళ్ల సీసాలు, దొరికిన వస్తువులను విసిరారు. వారిని నిరోధించడానికి పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. రెచ్చిపోయిన జనం పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, గుర్రాలను గాయపరిచారు. ఈ సందర్భంగానే ఇరువర్గాల వారికీ గాయాలయ్యాయి. అతికష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడుతామని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బెల్జియంలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసరం కాని అంతర్జాతీయ ప్రయాణాలపైనా నిషేధం ఉంది. పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఈ నెల 10 తరువాత ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతుందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన