బ్రిటన్‌ రాణి భర్త కన్నుమూత

ప్రధానాంశాలు

Updated : 10/04/2021 08:01 IST

బ్రిటన్‌ రాణి భర్త కన్నుమూత

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన విండ్సర్‌ కేజిల్‌లో తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 10న ఆయన శత జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. కొంతకాలంగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆయన... ఈ ఏడాది ఫిబ్రవరి 16న లండన్‌లోని కింగ్‌ ఎడ్వర్డ్‌-7 ఆసుపత్రిలో, తర్వాత సెయింట్‌ బర్తలోమ్యూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. మొత్తం 28 రోజుల చికిత్స అనంతరం మార్చి 16న డిశ్ఛార్జి అయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో భార్య, మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఎక్కువ రోజులు విండ్సర్‌ కేజిల్‌లోనే గడిపారు. ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలను కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి గరిష్ఠంగా 30 మందితో నిర్వహించాలని రాజ కుటుంబం నిర్ణయించింది. నేరుగా నివాళులు అర్పించడానికి బదులు, ఏదైనా ధార్మిక సంస్థకు సాయం అందించడానికి ప్రాధాన్యమివ్వాలని ప్యాలెస్‌ ఓ ప్రకటనలో ప్రజలను కోరింది.

గ్రీసు ద్వీపంలో పుట్టి...
ఎలిజబెత్‌-2, ప్రిన్స్‌ ఫిలిప్‌లది సుమారు 73 ఏళ్ల వైవాహిక బంధం. గ్రీకు, డెన్మార్క్‌ రాజకుటుంబాల వారసుడైన ప్రిన్స్‌... ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌లో చదువుకున్నారు. 18 ఏళ్ల వయసులో బ్రిటన్‌ నౌకా దళంలో చేరారు. ఆయన పనితీరును మెచ్చిన నాటి బ్రిటన్‌ రాజు జార్జ్‌-6... తన కుమార్తె ఎలిజబెత్‌ను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఆమెను మనువాడాలంటే ఫిలిప్‌ బ్రిటన్‌ పౌరుడిగా మారాలి. అందుకే, ఆయన తన గ్రీస్‌, డెన్మార్క్‌ రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నారు. 1947 నవంబరు 20న ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. 1952లో తండ్రి మరణానంతరం ఎలిజబెత్‌ రాణి అయ్యారు. ఫిలిప్‌... భార్య వెన్నంటి ఉంటూ పాలనలో ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ప్రిన్స్‌ 2017లో అధికారికంగా రాచరికపు విధుల నుంచి విశ్రాంతి పొందారు. భార్యతో కలిసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

బ్రిటన్‌లో విషాద ఛాయలు...
ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణంతో బ్రిటన్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వద్ద జాతీయ జెండాను అవనతం చేశారు. బ్రిటన్‌, కామన్వెల్త్‌ దేశాలతో పాటు... ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తరాలవారి అభిమానాన్ని ప్రిన్స్‌ చూరగొన్నారని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సంతాపం..
ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణం పట్ల భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. నౌకాదళంలోనూ, దాతృత్వ కార్యక్రమాల్లోనూ ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు. బ్రిటన్‌ రాజ కుటుంబానికి, ఆ దేశ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌ తదితరులు సంతాపం తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన