భారత జలాల్లో అమెరికా యుద్ధనౌక సంచారం

ప్రధానాంశాలు

Updated : 10/04/2021 09:54 IST

భారత జలాల్లో అమెరికా యుద్ధనౌక సంచారం

ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఆపరేషన్‌
స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కు చాటేందుకని వెల్లడి
భారత్‌ అభ్యంతరం

వాషింగ్టన్‌: ‘స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కు’ను చాటేందుకు భారత ప్రాదేశిక జలాల్లో లక్షదీవులకు సమీపంలో తమ నౌకాదళం ఒక ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. ఇందుకోసం ఇండియా ముందస్తు అనుమతిని తీసుకోలేదని పేర్కొంది. భారత్‌ ‘మితిమీరి కోరుతున్న సముద్ర ప్రాదేశిక హక్కుల’ను సవాల్‌ చేసేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది. ఈ చర్యపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 7న ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అమెరికా నౌకాదళంలోని ఏడో విభాగం కమాండర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో క్షిపణి ప్రయోగ సామర్థ్యమున్న విధ్వంసక నౌక యూఎస్‌ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ పాల్గొన్నట్లు చెప్పారు. ‘‘నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను చాటేందుకు ఈ యుద్ధనౌక.. లక్షదీవులకు పశ్చిమాన 130 నాటికల్‌ మైళ్ల దూరంలో భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) గుండా ప్రయాణించింది. ఈ క్రమంలో భారత్‌ నుంచి ముందస్తు అనుమతిని తీసుకోలేదు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇలా చేశాం. తాజా స్వేచ్ఛాయుత నౌకాయాన ఆపరేషన్‌ ద్వారా అంతర్జాతీయ చట్టం గుర్తించిన రీతిలో హక్కులు, స్వేచ్ఛను చాటాం. అలాగే భారత్‌ మితిమీరి కోరుతున్న సముద్ర హక్కులను సవాల్‌ చేశాం’’ అని ఆ ప్రకటన స్పష్టంచేసింది. అమెరికా బలగాలు రోజువారీగా భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తుంటాయని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన అన్ని ప్రాంతాల్లో అమెరికా బలగాలు గగనవిహారం, నౌకాయానం, ఇతర కార్యకలాపాలు సాగించగలవని చాటేలా వీటిని నిర్వహిస్తుంటామని వివరించింది. ఇలాంటివి గతంలోనూ చేశామని, భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని స్పష్టంచేసింది. ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదా రాజకీయ ప్రకటనలు చేయడం వీటి ఉద్దేశం కాదని వివరించింది. 1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాటం సాగిస్తున్న సమయంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా నౌకాదళంలోని ఏడో విభాగానికి చెందిన యుద్ధనౌకలు బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. భారత్‌కు మద్దతుగా నాటి సోవియట్‌ యూనియన్‌ జలాంతర్గాములు రంగప్రవేశం చేయడంతో అమెరికా యుద్ధనౌకలు వెనుదిరిగాయి.
కన్నేసే ఉంచాం భారత్‌
ఈ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యుద్ధనౌక పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలాకా జలసంధిలోకి వెళ్లే వరకూ నిరంతరంగా దాని కదలికలను పర్యవేక్షించినట్లు తెలిపింది. ‘‘సముద్ర చట్టంపై కుదిరిన ఐరాస ఒప్పందం (యూఎన్‌సీఎల్‌వోఎస్‌) ప్రకారం.. మా ఈఈజడ్‌లో సైనిక విన్యాసాలు చేపట్టాలంటే.. మా నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. దీన్ని ఉల్లంఘించినందుకు దౌత్యమార్గాల్లో అమెరికాకు నిరసన తెలియజేసినట్లు పేర్కొంది.
ఇదా మిత్ర ధర్మం?
భారత ఈఈజడ్‌ పరిధిలోకి వచ్చిన యూఎస్‌ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ యుద్ధనౌక అదేరోజున మాల్దీవుల చట్టాలనూ ఉల్లంఘించింది. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు గుర్తింపు ఉంది. భారత్‌-అమెరికా మైత్రి సవ్యంగానే ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లక్షదీవులకు సమీపంలోని ప్రాంతం భారత ఈఈజడ్‌ పరిధిలోకి వస్తుంది. భారత తీరం నుంచి సముద్రంలో 200 నాటికల్‌ మైళ్ల వరకూ ఇది విస్తరించి ఉంది. భారత సముద్ర చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా.. ఎలాంటి బెరుకు లేకుండా దాన్ని అమెరికా బహిర్గతం చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. 2018, 2019లోనూ భారత ప్రాదేశిక జలాలను ఇదే రీతిలో ఉల్లంఘించింది.

బిపిన్‌ రావత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు
అమెరికా ఉల్లంఘనకు పాల్పడిన రోజునే భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భారత్‌-అమెరికా దౌత్య బంధం గందరగోళంలో పడిందా అన్న ప్రశ్నలను లేవనెత్తారు. ‘చతుర్భుజ’ కూటమి ద్వారా అమెరికా శిబిరంలో భారత్‌ చేరిందన్న వాదనను ఆయన ఖండించారు. ఎలాంటి సైనిక సంకీర్ణాల్లో చేరకుండా వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకోవడమే తమ ఉద్దేశమని చెప్పారు. సమానత్వ ప్రాతిపదికపై వ్యూహాత్మక భాగస్వామ్యాలకు దిగుతున్నామన్నారు. అలాగే తొలిసారిగా భారత వ్యూహాత్మక భౌగోళిక సరిహద్దులనూ రావత్‌ ప్రస్తావించారు. ‘‘మా వ్యూహాత్మక ప్రదేశం.. పశ్చిమాన పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి తూర్పున మలాకా జలసంధి వరకూ.. ఉత్తరాన మధ్య ఆసియా ప్రాంతం నుంచి నుంచి దక్షిణాన భూమధ్య రేఖ వరకూ విస్తరించి ఉంది’’ అని చెప్పారు.
చతుర్భుజం.. కిం కర్తవ్యం..
డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం నాటి విధానాలను చెరిపేసే ఉద్దేశంతో తాజా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ప్రణాళిక ప్రకారం చేపడుతున్న కార్యక్రమంగా తాజా చర్యను విశ్లేషిస్తున్నారు. చైనాను కట్డడి చేసేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాలతో కూడిన చతుర్భుజ కూటమిని ట్రంప్‌ ఏర్పాటు చేశారు. అయితే డ్రాగన్‌ను ఈ కూటమి ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఎదుర్కొంటామని బైడెన్‌ స్పష్టం చేశారు. చతుర్భుజ కూటమి ఒక సైనిక కూటమి కాదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలూవియన్‌ కూడా తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన