close

ప్రధానాంశాలు

Updated : 11/04/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌?

దిగజారుతున్న పరిస్థితులు : ఉద్ధవ్‌ ఠాక్రే
50% ప్రయాణికులతోనే దిల్లీ మెట్రో రైళ్లు
మధ్యప్రదేశ్‌లో 22 వరకు లాక్‌డౌన్‌

ముంబయి: మహారాష్ట్రలో కొవిడ్‌-19 కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున, ప్రజల ప్రాణాలను కాపాల్సిన అవసరం ఉన్నందున లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి శనివారం వీడియో సమావేశం విధానంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంక్షల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే పేదలు, రోజువారీ కార్మికులు, కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టంచేశారు. కరోనా కారణంగా ప్రభావితమవుతున్న వర్గాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆర్థిక ప్యాకేజీపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటుచేసినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చెప్పారు. మరో మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పరిధి, ఎన్ని రోజులు?, ఎలా అమలు చేస్తారు? వంటివి త్వరలో ఖారారు చేస్తామని తెలిపారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలక మంత్రులతోపాటు ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పటోలే ఈ సందర్భంగా స్పష్టంచేశారు. అదే సమయంలో లాక్‌డౌన్‌ తక్కువ ఇబ్బందికరంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్‌సీపీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదివారం నిర్ణయం తీసుకోవడానికి ముందు కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. మరోవైపు, వారాంతపు లాక్‌డౌన్‌ కారణంగా ముంబయి నగరం శనివారం బోసిపోయింది. అనేక వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి.
దిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న కొవిడ్‌-19 కేసులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా దిల్లీ ప్రభుత్వం శనివారం పలు కఠిన ఆంక్షలను విధించింది. స్థానిక మెట్రో రైళ్లు, బస్సులు సీట్ల సామర్థ్యంలో 50% ప్రయాణికులతో నడుస్తాయి. వివాహాల్లో అతిథుల సంఖ్యను 50కి పరిమితం చేసింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, సంస్కృతిక సంబంధ సమావేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రెస్టారెంట్లు, బార్లు సైతం 50% సామర్థ్యంతో పనిచేయాలని అధికారులు స్పష్టంచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఈత కొలనులు మినహా మిగిలినవన్నీ మూసే ఉంచాలన్నారు.

* మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికులు ఆర్‌-పీసీఆర్‌ నెగెటివ్‌ నివేదిక చూపాల్సి ఉంటుంది. ఒకవేళ, నివేదిక లేకుండా వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో 60 గంటల లాక్‌డౌన్‌ కారణంగా వీధులు, మార్కెట్‌లు సందడి లేక శనివారం రాత్రి వెలవెలబోయాయి. శుక్రవారం 6 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుండడంతో దమోహ్‌లో మాత్రం ప్రచారానికి అనుమతించారు. మరోవైపు, కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 19 వరకు, కొన్ని జిల్లాల్లో 22వరకు లాక్‌డౌన్‌ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిన్‌, రాజ్‌గఢ్‌, విదిశ జిల్లాలో ఈ నెల 19 ఉదయం ఆరు గంటల వరకు, బాలాఘాట్‌, నర్సింగ్‌పుర్‌, సివానీ జిల్లాల్లో, జబల్‌పుర్‌ నగరంలో ఈ నెల 12 నుంచి 22 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన