మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ

ప్రధానాంశాలు

Updated : 14/04/2021 09:52 IST

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ

లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు
నేటి నుంచి 15 రోజులపాటు..
సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడి

ముంబయి: కరోనా కేసులు ఉద్ధృతమవుతుండటంతో... మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వీటిని అమలు చేస్తామన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందీ ఉండదని, కర్ఫ్యూ నుంచి వాటిని మినహాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ‘లాక్‌డౌన్‌’ అనే పదాన్ని ఉపయోగించకుండా... ఆ తరహా నిబంధనలను అమలు చేస్తామని ఉద్ధవ్‌ పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన మంగళవారం సామాజిక మాధ్యమం ద్వారా మాట్లాడారు. ‘‘కరోనా బాధితులను రక్షించేందుకు కేంద్రం వాయుసేన సేవలను ఉపయోగించి సత్వరం ఆక్సిజన్‌ను సరఫరా చేయాలి’’ అని ఉద్ధవ్‌ కోరారు.
లాక్‌డౌన్లు ఉండవు: నిర్మలా సీతారామన్‌
కరోనా రెండో దశను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్లను విధించబోదని, అయితే... ఎక్కడికక్కడ స్థానిక కంటైన్‌మెంట్‌ జోన్లను మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్‌పాస్‌తో వీడియో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

నిబంధనలిలా...
జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలవుతుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదు. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేస్తారు. ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, సహాయకులు యథావిధిగా పనులు చేసుకోవచ్చా? లేదా? అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నిర్ణయిస్తారు.

వీటికి మినహాయింపు
ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలు సహా... కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలకు మినహాయింపు ఇచ్చారు. ప్రజా రవాణాకు ఇబ్బంది ఉండదు. విమానాలు, రైళ్లు, ఆటోలు, బస్సులు తిరుగుతాయి. సెబీ, ఆర్‌బీఐ, ఈ-కామర్స్‌, రవాణా-కార్గో తదితర సేవలు కొనసాగుతాయి.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన