close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో వారాంతపు కర్ఫ్యూ

ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటన

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వారాంతపు కర్ఫ్యూ సహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ (శుక్రవారం) రాత్రి 10 గంటల నుంచి 19 (సోమవారం) ఉదయం ఆరు గంటల వరకూ వారాంతపు కర్ఫ్యూ ఉంటుందన్నారు. భారీ దుకాణ సముదాయాలు, వ్యాయామశాలలు, ప్రదర్శనశాలలు, ఉద్యానవనాలు వంటివి మాత్రం ఈ నెల 30 వరకు మూసివేస్తామన్నారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో భేటీ అనంతరం కేజ్రీవాల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. సోమవారం తర్వాత పరిస్థితిపై సమీక్షించి వారాంతపు కర్ఫ్యూను పొడిగించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తారు. రెస్టారెంట్లలో తినడానికి వీల్లేదన్న దిల్లీ సీఎం.. పార్శిల్‌ తీసుకెళ్లేందుకే అనుమతిస్తామని చెప్పారు. సినిమా థియేటర్లను 30శాతం సామర్థ్యంతోనే నడపాలన్నారు. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని దిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికారసంస్థ (డీడీఎంఏ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని, దిల్లీలో ప్రస్తుతం 5,000 పడకలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు.
విదేశీ వ్యాక్సిన్లకు 3 రోజుల్లోనే అత్యవసర అనుమతులు!
దేశంలో కొవిడ్‌ కేసులు ఉద్ధృతమవుతున్న వేళ... విదేశీ టీకాలకు అనుమతులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్న 3 పనిదినాల్లోనే... భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించి గురువారం మార్గదర్శకాలను వెల్లడించింది. విదేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతించిన టీకాలు ఇక భారత్‌లో అడుగుపెట్టడం మరింత సులభం కానుంది. అత్యవసర అనుమతుల మంజూరుకు సంబంధించి వ్యాక్సిన్‌ నిర్వహణపై ఏర్పాటైన నిపుణుల బృందం పలు ప్రతిపాదనలు చేసింది. తదనుగుణంగా... డీసీజీఐ నేతృత్వంలోని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) మార్గదర్శకాలను రూపొందించింది.
కొవిడ్‌పై పోరుకు రిలయన్స్‌ ‘మహా’చేయూత
ముంబయి: కరోనా కేసులు అమాంతం పెరుగుతుండటం.. ఆక్సిజన్‌కు కొరత ఏర్పడటంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ దాతృత్వం చాటారు. తమ రిఫైనరీల నుంచి మహారాష్ట్రలో వైద్యపరమైన అవసరాలకు 100 టన్నుల ఆక్సిజన్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ కూడా దక్షిణాదిన వైద్యపరమైన అవసరాల కోసం 20 టన్నుల ఆక్సిజన్‌ను కోచి రిఫైనరీలో సిద్ధం చేస్తోంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన