close

ప్రధానాంశాలు

Updated : 16/04/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాలు వెనక్కి

సెప్టెంబరు 11లోగా ప్రక్రియ పూర్తి  
అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్న అమెరికా బలగాలను సెప్టెంబరు 11లోగా వెనక్కి తీసుకు రానున్నట్టు ప్రకటించారు. శ్వేత సౌధంలోని ట్రీటీ రూం నుంచి బుధవారం టెలివిజన్‌ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. అఫ్గాన్‌ యుద్ధం అంటే తరాల పాటు కొనసాగేది కాదని స్పష్టం చేశారు. ‘‘ఒక్క దేశంపై ఏటా బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తూ వేలాది మంది సైనికులను ఉంచడం అర్థం లేని పని. అఫ్గాన్‌లో శాంతి నెలకొనడానికి పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, రష్యా, చైనా, భారత్‌, టర్కీలు ఎంతో చేయగలవు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయింది’’ అని వివరించారు. బైడెన్‌ తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని, అప్పుడు ఆ దేశం ఉగ్రవాదుల సంరక్షణ కేంద్రంగా మారుతుందన్న ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారణంగా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ముప్పు ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో 2,500-3,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
భారత్‌కు తీవ్ర ఆందోళనకరం
అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లడం భారత్‌కు తీవ్ర ఆందోళనకరమని నిపుణులు భావిస్తున్నారు. తాలిబన్ల ముప్పు అధికమవుతుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద సహాయకురాలిగా పనిచేసిన లిసా కర్టిస్‌ చెప్పారు. ‘‘1990లో ఆఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలో ఉన్నప్పుడు వారు ప్రపంచంలోని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి శిక్షణ ఇచ్చారు. నిధులు సమకూర్చారు. వారిలో లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ మహమ్మద్‌ ఉగ్రవాదులు 2001లో భారత్‌ పార్లమెంటుపైనే దాడికి దిగారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ ఉగ్రవాదులకు సురక్షిత కేంద్రాలే’’ అని చెప్పారు. బైడెన్‌ నిర్ణయాన్ని అమెరికా పత్రికలు తప్పుపట్టాయి. ఉగ్రవాదం మళ్లీ పెరిగితే సైనికుల ప్రాణత్యాగాలకు అర్ధం ఉండదని వ్యాఖ్యానించాయి. ఉగ్రవాదాన్ని అరికట్టే బాధ్యత అమెరికా తీసుకోవాలని చైనా పేర్కొంది.
ఆ రోజునే ఎందుకు?
న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై అఫ్గాన్‌లోని ఆల్‌ ఖైదా ఉగ్రవాదులు 2001 సెప్టెంబరు 11న దాడి చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి 20 ఏళ్లు పూర్తికానుండడంతో అదేరోజు నాటికి బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మే ఒకటో తేదీ నుంచి సైనికుల తిరుగుముఖం ప్రారంభం కానుంది. ‘‘మనం అక్కడికి రెండు కారణాలతో వెళ్లాం. ఒకటి...అల్‌ ఖైదా అధిపతి ఒసామా బిన్‌ లాడెన్‌ బెడదను నివారించడం. రెండు..ఆ దేశం ఉగ్రవాదులకు స్థావరం కాకుండా చూడడం. వాటిని సాధించాం. అఫ్గాన్‌ సమైక్యంగా ఉండేలా చూడడం మన ఆశయమేమీ కాదు’’ అని స్పష్టం చేశారు. ప్రకటన చేసిన అనంతరం బైడెన్‌..ఆర్లింగ్టన్‌ నేషనల్‌ సెమిట్రీకి వెళ్లి అఫ్గాన్‌ యుద్ధంలో అమరులైన సైనికుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. అఫ్గాన్‌లో ఉన్న పది వేల మంది నాటో సైనికులు కూడా వెనక్కి వస్తారని ఆ కూటమి చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ తెలిపారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన