ఆక్సిజన్‌ ట్యాంకర్లను నిరంతరం నడపాలి

ప్రధానాంశాలు

Updated : 17/04/2021 07:36 IST

ఆక్సిజన్‌ ట్యాంకర్లను నిరంతరం నడపాలి

ప్లాంట్ల గరిష్ఠ సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలి
అధికారులకు ప్రధాని మోదీ నిర్దేశం

ఈనాడు, దిల్లీ: దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ లభ్యతపై ప్రధాని మోదీ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించారు. నిరంతరం ఆక్సిజన్‌ను సరఫరా చేసేలా 24 గంటలూ ట్యాంకర్లను నడపాలని, ఇందుకోసం డ్రైవర్లు షిఫ్టుల వారీగా పనిచేసేలా మార్పులు చేయాలన్నారు. ఖాళీ సిలిండర్లను భర్తీచేసే ప్లాంట్లు 24 గంటలూ నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక సిలిండర్లను కూడా మెడికల్‌ ఆక్సిజన్‌ భర్తీ కోసం అనుమతిస్తున్నందున... అన్ని వనరులనూ పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. నైట్రోజన్‌ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ట్యాంకర్లుగా మార్చి, కొరతను అధిగమించాలని నిర్దేశించారు. దేశంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు.
సరఫరాపై ఆంక్షలు వద్దు...
దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరిగినందున... దాని రవాణాపైగానీ, సరఫరాపైగానీ రాష్ట్రాలు ఆంక్షలు విధించరాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆక్సిజన్‌ వాహనాలు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించడంపై ఎలాంటి నియంత్రణ విధించకూడదని ఆదేశించారు.

నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం: హర్షవర్ధన్‌

కొవిడ్‌ విజృంభిస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, సరైన జాగ్రత్తలు పాటించాలని... ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరమని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ హెచ్చరించారు. ఆయన శుక్రవారమిక్కడ ఎయిమ్స్‌లోని కొవిడ్‌ వార్డుకు వెళ్లి, రోగులను పరామర్శించారు. వైద్యులతో కలిసి పడకల లభ్యత, ఆక్సిజన్‌ అందుబాటుపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కొవిడ్‌ నుంచి మనమంతా బయటపడాలంటే... ప్రతి ఒక్కరూ నిబంధనలను పాలించాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన