close

ప్రధానాంశాలు

Published : 19/04/2021 04:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిశ్రమలకు ఆక్సిజన్‌ బంద్‌

  22 నుంచి అమలు
  అంతా వైద్య అవసరాలకు మళ్లింపు

ఈనాడు, దిల్లీ: ఆసుపత్రుల్లోని రోగులకు ప్రాణవాయువు కొరత లేకుండా చూడడం కోసం ఈ నెల 22 నుంచి పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్‌ సరఫరాను బంద్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. తొమ్మిది పరిశ్రమలకు మినహా మిగిలినవాటికి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఆక్సిజన్‌ సరఫరా చేయకూడదని అందులో పేర్కొన్నారు. సాధికార బృందం-2 చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కింది స్థాయి అధికారులకు ఈ విషయం చెప్పి తప్పనిసరిగా అనుసరించేలా చూడాలని తెలిపారు. దీనివల్ల దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ సౌకర్యం పెరిగి విలువైన ప్రాణాలు నిలబెట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ కూడా రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెంచడంతోపాటు, అందుబాటులో ఉన్నదాన్ని హేతుబద్ధంగా గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాల్సి ఉందని సూచించారు. భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చించి పారిశ్రామిక ఆక్సిజన్‌ వినియోగాన్ని నియంత్రించి దాన్ని వైద్య అవసరాల కోసం మళ్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిషేధాజ్ఞలు 9 పరిశ్రమలకు వర్తించవని పేర్కొన్నారు. 1. యాంపౌలెస్‌ అండ్‌ వయల్స్‌ (టీకా మందులు), 2. ఔషధ కర్మాగారాలు, 3. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, 4. ఉక్కు కర్మాగారాలు, 5. అణు ఇంధన సౌకర్యాలు, 6. ఆక్సిజన్‌ సిలిండర్‌ తయారీదారులు, 7. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 8. ఆహారం, నీటి శుద్ధి కేంద్రాలు, 9. ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మినహాయింపు ఉన్నట్లు వివరించారు. మిగిలిన పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా చేయొద్దని సూచించారు. దిగుమతి చేసుకోవడం, సొంత ఉత్పత్తి కేంద్రాల్లో తయారు చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన