బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన రద్దు

ప్రధానాంశాలు

Updated : 20/04/2021 10:10 IST

బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన రద్దు

లండన్‌: బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన రద్దయింది. కరోనా సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉభయ దేశాల తరఫున బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26న దిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపాలని జాన్సన్‌ తొలుత అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ వెళ్లవద్దని ప్రతిపక్షాలు సహా ఇతర వర్గాలు సూచించాయి. దాంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెలాఖరులో మోదీతో వర్చువల్‌ విధానంలో చర్చలు జరపనున్నారు. భారత్‌-బ్రిటన్‌ సంబంధాల మెరుగుదల కోసం ఉద్దేశించిన ‘2030 మార్గసూచీ’పై ఇరువురు నేతలు చర్చిస్తారు. బోరిస్‌ జాన్సన్‌ జనవరిలో భారత గణతంత్ర దినోత్సవ అతిథిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగానే అప్పుడు కూడా పర్యటన రద్దయింది.
బాధాకరమే కానీ తప్పదు: జాన్సన్‌
ఈ సందర్భంగా బోరిస్‌ జాన్సన్‌ విలేకరులతో మాట్లాడుతూ పర్యటన రద్దు కావడం బాధాకరమే అయినప్పటికీ, మంచి నిర్ణయమేనని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లోని పరిస్థితిని చూసిన తరువాత పర్యటనను వాయిదా వేసుకోవడమే మంచిదని భావిస్తున్నా. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ విపత్తును ఎదుర్కొంటున్నాయి. అందరమూ భారత్‌కు సానుభూతి చూపిస్తున్నాం’’ అని తెలిపారు.  

‘రెడ్‌ లిస్ట్‌’లో భారత్‌

భారత్‌లో కరోనా తీవ్రత పెరిగిన దృష్ట్యా ఆ దేశాన్ని ‘ఎర్ర జాబితా’ (రెడ్‌ లిస్ట్‌)లో పెట్టినట్టు ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ తెలిపారు. దీని ప్రకారం భారత్‌ నుంచి అన్ని రకాల ప్రయాణాలను నిషేధిస్తారు. ఆ దేశం నుంచి వచ్చే బ్రిటన్‌ పౌరులు తప్పనిసరిగా పది రోజుల పాటు హోటల్‌ క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మంత్రి మాట్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌ తరహా కరోనా కేసులు దేశంలో 103 కనిపించాయి. ఇవన్నీ అంతర్జాతీయ ప్రయాణాల కారణంగా వచ్చినవే’’ అని చెప్పారు. ఈ వైరస్‌ను పరీక్షిస్తున్నామని, ఇదేమైనా కొత్త తరహాదా? త్వరగా వ్యాపిస్తుందా? టీకాలకు లొంగదా? అనే విషయాలపై అధ్యయనం చేస్తున్నట్టు వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా, కష్టమైనప్పటికీ...భారత్‌ను ఎర్ర జాబితాలో పెట్టామని చెప్పారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన