close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాణిజ్య బంధం బలోపేతం

ఇరు దేశాల మధ్య రూ.10,230 కోట్ల వ్యాపారం, పెట్టుబడులు
2030 మార్గసూచీపై కలిసి అడుగు

 భారత్‌-బ్రిటన్‌ నిర్ణయం

లండన్‌, దిల్లీ: భారత్‌తో తమ సంబంధాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఇరు దేశాల సంబంధాలను సమున్నత స్థితికి తీసుకువెళ్లేందుకు ఇరుదేశాల ప్రధానులు ప్రతినబూనారు. 2030 మార్గసూచీపై భారత ప్రధాని నరేంద్రమోదీతో మంగళవారం జాన్సన్‌ వర్చువల్‌ విధానంలో భేటీ అయ్యారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, వాణిజ్యం, విద్య, శాస్త్ర-సాంకేతిక, రక్షణ రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకునేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనకు ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదాను బ్రిటన్‌కి ఇవ్వాలని భారత్‌ నిర్ణయించింది. ఐరోపా దేశాల్లో దీనిని మొట్టమొదట పొందింది బ్రిటనేనని అధికార ప్రకటన పేర్కొంది. రాబోయే దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చించడానికి తాజా ఒప్పందం దోహదపడుతుందని జాన్సన్‌ తెలిపారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు 100 కోట్ల పౌండ్ల (సుమారు రూ.10,230 కోట్లు)కు చేరుకుంటాయని చెప్పారు. ‘‘ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యాల్లో బ్రిటన్‌ ఒకటి. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్దది. ఈ రెండు దేశాల ప్రజల మధ్య చక్కని సంబంధాలున్నాయి. ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే మరిన్ని చర్యలు చేపట్టడానికి రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత సాధనలో, అంటువ్యాధుల్ని ఎదుర్కోవడంలో భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుంది. అవసరమైనప్పుడు ఔషధాలు, టీకాలు, ఇతర వైద్యపరమైన ఉత్పత్తుల్ని సరఫరా చేసుకునేందుకు కూడా వీలుంటుంది. రెండు దేశాల నౌకాదళాలు, వాయుసేనలు సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటాయి.
ఆర్థిక నేరగాళ్ల అప్పగింతపైనా చర్చ
ఆర్థిక నేరాలకు పాల్పడి, పలాయనంలో ఉన్న విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీల అప్పగింత విషయం నేతల మధ్య చర్చకు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లను విచారణ నిమిత్తం సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపాల్సిందిగా మోదీ ప్రస్తావించినట్లు చెప్పారు. బ్రిటన్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తికి ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ఏటా 3000 మంది భారతీయ వృత్తి నిపుణులకు బ్రిటన్‌లో అవకాశాలు కల్పించాలని, అక్రమంగా బ్రిటన్‌లో నివాసం ఉంటున్నవారు మాత్రం ఆ దేశాన్ని విడిచి వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. మోదీ-జాన్సన్‌ల భేటీకి ముందు ఈ మేరకు ఒప్పందంపై బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ బ్రిటన్‌లో సంతకాలు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన