రాజీ యత్నాలు.. రాకెట్‌ దాడులు
close

ప్రధానాంశాలు

Published : 14/05/2021 05:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజీ యత్నాలు.. రాకెట్‌ దాడులు

ఫలించని ఈజిప్ట్‌ రాయబారం
ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య కొనసాగిన ఘర్షణ

గాజా సిటీ: ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య సంధి కుదుర్చేందుకు ఈజిప్ట్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముస్లింల పవిత్ర రంజాన్‌ మాసం చివరి రోజైన ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నాడు కూడా పరస్పర దాడులు కొనసాగాయి. దీంతో పాలస్తీనాలో పండగా వాతావరణమే కనిపించలేదు. హమాస్‌ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌ భూభాగంపైకి సంధించగా....గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడ్డాయి. కొన్ని రాకెట్లు టెల్‌ అవీవ్‌ సమీప ప్రాంతాలను తాకినా పెద్దగా ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ నగరంలోని అరబ్బులు, యూదుల మధ్య పరస్పర దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్నిటిని ఇతర చోట్లకు మళ్లించారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో గురువారం వరకు 83 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, వీరిలో 17 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. 480 మందికిపైగా గాయపడ్డారు. 13 మంది తమ సభ్యులు చనిపోయినట్లు హమాస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇజ్రాయెల్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు సైనికుడని ఆ దేశ వర్గాలు పేర్కొన్నాయి.
90% రాకెట్లను అడ్డుకున్న ఐరన్‌ డోమ్‌  
అంతర్జాతీయ సమాజం తరఫున మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఈజిప్ట్‌ రంగంలోకి దిగింది. ఈజిప్ట్‌ అధికారులు తొలుత గాజాలో హమాస్‌ నేతలను కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత టెల్‌ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్‌ నేతలతోనూ భేటీ అయ్యారు. ఇరువైపుల నుంచి సంధి యత్నాలకు సానుకూల స్పందన రాలేదని సమాచారం. రాజీ యత్నాలు ఒకవైపు జరుగుతుండగానే గాజా వైపు నుంచి ఉగ్రవాదులు మూకుమ్మడిగా ఇజ్రాయెల్‌ పైకి వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌, అణు రియాక్టర్లున్న డిమోనా, జరూసలెం లక్ష్యంగా ఉగ్రవాదులు రాకెట్‌ దాడులకు పాల్పడ్డారు. నష్టం ఏ మేరకు జరిగిందన్నది తెలియరాలేదు. వీటికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాపై వైమానిక దాడులు జరిపింది. ఐరన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సందర్శించారు. హమాస్‌ ప్రయోగించిన 1200 రాకెట్లలో 90 శాతాన్ని విజయవంతంగా ఐరన్‌ డోమ్‌ అడ్డుకుందని తెలిపారు.
రంగంలోకి రిజర్వుడు సైనికులు
హమాస్‌ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్‌ 9వేల మంది రిజర్వుడు సైనికులను రంగంలోకి దింపింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కొనసాగుతున్న విచక్షణారహిత దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించారు. గాజాలోని పౌర ప్రాంతాల నుంచి రాకెట్లను సంధించడాన్ని ఆయన గర్హించారు. సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌నూ కోరారు. ఉద్రిక్తతల నివారణకు సీనియర్‌ దౌత్యవేత్తను పంపించనున్నట్లు అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి బ్లింకెన్‌ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన