Corona: మూడో ఉద్ధృతిలో చిన్నారులకు ముప్పుపై భయాలొద్దు

ప్రధానాంశాలు

Updated : 26/05/2021 07:31 IST

Corona: మూడో ఉద్ధృతిలో చిన్నారులకు ముప్పుపై భయాలొద్దు

జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి ఛైర్మన్‌

దిల్లీ: మరికొన్ని వారాల్లో లేదా నెలల్లో విరుచుకుపడబోతోందని భావిస్తున్న కరోనా వైరస్‌ మూడో ఉద్ధృతి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అతి భయాందోళనలు తగవని జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా మండలి(ఎన్‌టీఏజీఐ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోడా తెలిపారు. తొలి రెండు దశల్లో కొద్ది మంది చిన్నారులకు వైరస్‌ సోకిన విధంగానే రాబోయే రోజుల్లోనూ ప్రభావం చూపవచ్చని, అంతకుమించి పెద్ద ప్రమాదం వచ్చిపడుతుందనే అంచనాలకు సహేతుకమైన ఆధారాల్లేవని ఆయన పేర్కొన్నారు. అయితే, వైరస్‌ సోకిన చిన్నారులకు సరైన వైద్యం అందించటానికి అవసరమైన సదుపాయాలను, వనరులను అదనంగా సమకూర్చుకోగలిగితే సమస్యను సులభంగా అధిగమించగలమని ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘నవజాత శిశువులు, చిన్నారులు, గర్భిణుల సంరక్షణకు ప్రత్యేక సదుపాయాలు అవసరం. కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారుల వెంట తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది. గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశం ఉంది. ఇటువంటి ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చికిత్సా విధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో ప్రత్యేక సంరక్షణ వసతుల్ని కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అరోడా తెలిపారు.
* కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో చిన్న పిల్లలు వైరస్‌ బారినపడుతున్నప్పటికీ వారిలో లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని నిపుణులు తెలిపారు. పిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటులోకి వస్తే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని వైరాలజిస్ట్‌ ఉపాసనా రే అభిప్రాయపడ్డారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన