చోక్సీని రప్పించేందుకు రంగం సిద్ధం!

ప్రధానాంశాలు

Updated : 31/05/2021 06:24 IST

చోక్సీని రప్పించేందుకు రంగం సిద్ధం!

అవసరమైన పత్రాలతో డొమినికా చేరిన విమానం
నేరుగా భారత్‌కు పంపేయాలని ఆంటిగ్వా ప్రధాని సూచన
జైలులో గాయాలతో వజ్రాల వ్యాపారి

దిల్లీ: బ్యాంకులను మోసగించి, విదేశాలకు పరారైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని డొమినికా నుంచి భారత్‌కు రప్పించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఒక ప్రైవేటు విమానంలో భారత ప్రభుత్వం పంపిందని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రధాన మంత్రి గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు. మరోవైపు గాయాలతో కారాగారంలో ఉన్న చోక్సీ ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. అతడిని రప్పించేందుకు భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు ముమ్మరం చేశాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కు రూ.13,500 కోట్లు ఎగవేసిన కేసులో చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీలు నిందితులుగా ఉన్నారు. నీరవ్‌.. ప్రస్తుతం లండన్‌ జైల్లో ఉన్నాడు. భారత్‌కు తనను అప్పగించాలన్న ప్రతిపాదనను అతడు అక్కడి కోర్టులో సవాల్‌ చేశాడు. చోక్సీ మాత్రం భారత్‌ నుంచి పరారు కావడానికి ముందే 2017లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడాలో పౌరసత్వం తీసుకున్నాడు. 2018 జనవరిలో అక్కడికి పరారయ్యాడు. ఆ తర్వాతే పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఆంటిగ్వా అండ్‌ బార్బడాలో మే 23న అదృశ్యమైన చోక్సీ.. రెండు రోజుల తర్వాత అనూహ్యంగా పొరుగునున్న డొమినికాలో ప్రత్యక్షమయ్యాడు. అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని రప్పించేందుకు భారత్‌ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇటీవల ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానాన్ని దిల్లీ నుంచి డొమినికాకు పంపింది. దీంతో చోక్సీని భారత్‌కు తరలించే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి.  

గర్ల్‌ ఫ్రెండ్‌తో విందు కోసమే..
చోక్సీ అప్పగింతకు అవసరమైన పత్రాలు ఆ ప్రత్యేక విమానంలో వచ్చాయని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ చెప్పారు. డొమినికా కోర్టులో వాదనలు వినిపించడానికి వీటిని భారత్‌ సమర్పిస్తుందని తెలిపారు. చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి, భారత్‌కు అప్పగించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అతడిని తిరిగి ఆంటిగ్వాకు పంపొద్దని, ఇక్కడ పౌరసత్వం ద్వారా లభించిన రాజ్యాంగ హక్కుల వల్ల అతడికి రక్షణ లభిస్తుందని డొమినికాకు సూచించారు. అతడిని నేరుగా భారత్‌కు పంపాలన్నారు. ఈ విషయమై అటు డొమినికాతో ఇటు భారత్‌తో సంప్రదింపులు సాగిస్తున్నామని చెప్పారు. గర్ల్‌ఫ్రెండ్‌తో విందు కోసం గానీ ఆమెతో సరదాగా గడపడానికి గానీ బోటు ద్వారా డొమినికాకు చోక్సీ చేరుకొని ఉంటాడని తెలిపారు. ఎన్నికల నిధుల కోసం తమ దేశ విపక్షం యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (యూపీపీ) చోక్సీకి మద్దతు పలుకుతోందని ఆరోపించారు. అయితే చోక్సీని కిడ్నాప్‌చేసి డొమినికాకు తరలించారని యూపీపీ ఆరోపించింది. అతడిని నేరుగా భారత్‌కు అప్పగించాలని డొమినికాకు బ్రౌన్‌ సూచించడాన్ని తప్పుబట్టింది. అయితే మరో రెండు రోజుల్లో చోక్సీని ఆంటిగ్వాకు పంపుతామని డొమినికా అధికారులు అంతకుముందు పేర్కొన్నారు.  

జైలులో గాయాలతో చోక్సీ

ప్రస్తుతం డొమినికా జైలులో ఉన్న చోక్సీ ఫొటోలను ‘ఆంటిగ్వా న్యూస్‌ రూం’ విడుదల చేసింది. అందులో ఆయన చేతులు, ఎడమ కన్నుపై గాయాలైనట్లుగా ఉన్నాయి. కన్ను బాగా ఎర్రబారి ఉంది. ఆంటిగ్వా అండ్‌ బార్బుడాలోని జాలీ హార్బర్‌లో కొంతమంది తనను కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని చోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది వేన్‌ మార్ష్‌ ఆరోపించారు. ఆంటిగ్వా, భారత్‌కు సంబంధించిన పోలీసుల్లా వారు కనిపించారని చెప్పారు. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత చోక్సీతో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అధికారులు అంగీకరించారని తెలిపారు. ఆయనను తీవ్రంగా కొట్టి ఉంటారని, కళ్లు ఉబ్బిపోయాయని, ఒంటిపై కాలిన గాయాలు ఉన్నాయని మార్ష్‌ ఆరోపించారు. ఈ మేరకు డొమినికా హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో చోక్సీని డొమినికా నుంచి పంపివేసే చర్యలపై కోర్టు స్టే విధించింది. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 2న జరగనుంది. అతడి నిర్బంధం చట్టబద్ధమా.. కాదా.. అన్నదానిపై వాదనలు వింటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన