విద్యార్థుల బెయిల్‌ రద్దుకు నిరాకరణ

ప్రధానాంశాలు

Published : 19/06/2021 05:00 IST

విద్యార్థుల బెయిల్‌ రద్దుకు నిరాకరణ

‘ఉపా’పై వాదనలు వింటాం
సుప్రీంకోర్టు వెల్లడి

దిల్లీ: తూర్పు దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టయిన ముగ్గురు విద్యార్థులకు దిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన నటాషా నర్వాల్‌, దేవాంగన్‌ కలిత, జామియా మిల్లియా ఇస్లామియాకు చెందిన అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాలకు బెయిల్‌ మంజూరు కాగా, వారు తిహార్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే దీన్ని సవాలు చేస్తూ దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్‌ హేమంత్‌ గుప్త, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. బెయిల్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ- ‘ఉపా’ చట్టం)పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. బెయిల్‌ మంజూరు చేసే విషయంలో హైకోర్టు వంద పేజీల తీర్పు రాసిందని, ఇది ఆశ్చర్యకరంగా పేర్కొంది. ఈ వ్యాఖ్యలు మొత్తం దేశంపై ప్రభావం చూపేవిగా ఉన్నందున ఈ చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేయాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుతం దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపి దేశంలోని ఇతర కోర్టులు బెయిల్‌ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ మొత్తం ఉపా చట్టాన్ని హైకోర్టు తలకిందులు చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రత్యర్థులకు కూడా నోటీసులు ఇచ్చి అందరి వాదనలు వింటామని తెలిపింది. జులై మూడో వారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
మెడికల్‌ పీజీ(ఫైనల్‌) పరీక్షలపై ఆదేశాలివ్వలేం
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌(పీజీ) వైద్య విద్యార్థుల చివరి ఏడాది పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడానికి సంబంధించి విశ్వవిద్యాలయాలకు ఎలాంటి ఆదేశాలూ తాము ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అంశంలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లుగా ఉన్నతిని సాధించాలంటే పీజీ చివరి ఏడాది పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే, వీరిలో కొందరు కొవిడ్‌ విధుల్లో ఉన్నందున పరీక్షల తేదీలను ప్రకటించే సమయంలో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) ఏప్రిల్‌ నెలలోనే విశ్వవిద్యాలయాలకు సూచించింది. పరీక్షల సన్నద్ధతకు తగిన సమయాన్ని ఇవ్వాలనీ పేర్కొంది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేస్తూ పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చింది. పరీక్షలు రాయకుండానే పీజీ వైద్య విద్యార్థులకు ఉన్నతిని కల్పించటాన్ని అనుమతించబోమనీ ధర్మాసనం విస్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన