కేంద్ర ఐటీ మంత్రి ట్విటర్‌ ఖాతా నిలిపివేత

ప్రధానాంశాలు

Updated : 26/06/2021 09:39 IST

కేంద్ర ఐటీ మంత్రి ట్విటర్‌ ఖాతా నిలిపివేత

కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్న సామాజిక మాధ్యమం
గంట తర్వాత పునరుద్ధరణ
ట్విటర్‌పై విరుచుకుపడిన మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌

దిల్లీ: కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతా శుక్రవారం బ్లాక్‌ అయింది. కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన ఖాతాను ట్విటర్‌ తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించడంతో గంట తర్వాత పునరుద్ధరించింది. తమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖాతా మళ్లీ మూత పడుతుందన్న హెచ్చరిక సందేశాన్ని ఉంచింది. నూతన ఐటీ చట్టం నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య విభేదాలు రాజుకొన్న తరుణంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిలిపివేత ఎందుకంటే..

అమెరికన్‌ డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టాన్ని (డీఎంసీఏ) ఉల్లంఘించారని పేర్కొంటూ ట్విటర్‌.. కేంద్ర ఐటీ మంత్రి ఖాతాను నిలిపేయడం సంచలనం రేపింది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ‘మా తుఝే సలాం’ పాటను మంత్రి తన ట్వీట్‌లో షేర్‌ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ పాటపై హక్కులున్న సోనీ మ్యూజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తరపున ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ద ఫొనోగ్రాఫిక్‌ ఇండస్ట్రీ.. ట్విటర్‌కు ఫిర్యాదు చేయడంతో.. డీఎంసీఏ నిబంధనల ప్రకారం మంత్రి ఖాతాను నిలిపేసింది. కాగా ట్విటర్‌ చర్యపై ఐటీ మంత్రి మండిపడ్డారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఖాతాను నిలిపేయడం.. నూతన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడమేనంటూ మరో సామాజిక మాధ్యమం ‘కూ’లో వరుస పోస్టులు పెట్టారు. ‘‘మిత్రులారా.. ఈరోజు ఒక విచిత్రం జరిగింది. అమెరికన్‌ డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించానంటూ ట్విటర్‌ నా ఖాతాను గంట పాటు యాక్సెస్‌ చేసుకోనివ్వలేదు. ఆ తర్వాత యాక్సెస్‌కు వీలు కల్పించింది.’’ అంటూ పోస్టు చేశారు. చట్టాన్ని ధిక్కరించేలా ట్విటర్‌ చర్యలున్నాయని, ఈ విషయాన్ని ఇదివరకు పలుమార్లు మాట్లాడినందుకే తన ఖాతాను నిలిపేసి ఉంటారని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘భావ ప్రకటన స్వేచ్ఛకు దూతగా చెప్పుకొంటూ, తన సొంత అజెండానే నడపడానికి ఆసక్తి చూపుతున్నట్టు ట్విటర్‌ తాజా చర్యతో స్పష్టమైంది. వారి గీతను దాటితే ఖాతాను ఏకపక్షంగా తొలగిస్తామనే హెచ్చరికలు చేస్తున్నారు.’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘నూతన ఐటీ నిబంధనల్ని ట్విటర్‌ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ అలా అంగీకరిస్తే తమ సొంత అజెండాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఏకపక్షంగా బ్లాక్‌ చేయలేరు కదా’’ అని ఎద్దేవా చేశారు. నూతన ఐటీ నిబంధనలపై కేంద్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఏ సామాజిక మాధ్యమమైనా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ట్విటర్‌పై కేంద్ర మంత్రి ధ్వజమెత్తిన అనంతరం.. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయంటూ పలువురు యూజర్లు నిట్టూర్చారు. కాంగ్రెస్‌  సీనియర్‌ నేత, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ(ఐటీ) ఛైర్మన్‌ శశి థరూర్‌ కూడా వీరిలో ఉన్నారు. 

* మార్చి 26 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమాలన్నీ ఫిర్యాదుల పరిష్కారానికి స్థానిక అధికారులను నియమించాలి. ఈ విషయంలో కేంద్రం ట్విటర్‌కు అదనపు గడువు ఇచ్చినా అమలు చేయడంలో విఫలమైంది. దీంతో కీలకమైన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. ఫలితంగా యూజర్లు ఎవరైనా చట్టవిరుద్ధ కంటెంట్‌ను పోస్టు చేస్తే అందుకు ట్విటర్‌ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ట్విటర్‌ మధ్య యుద్ధం నడుస్తోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన