Corona: డెల్టా ప్లస్‌పై కంగారొద్దు

ప్రధానాంశాలు

Updated : 29/06/2021 07:03 IST

Corona: డెల్టా ప్లస్‌పై కంగారొద్దు

వేగంగా వ్యాప్తిచెందుతుందని చెప్పే ఆధారాల్లేవ్‌
టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందనీ తేలలేదు
కొవిడ్‌ కార్యదళం అధినేత వీకే పాల్‌ వెల్లడి

దిల్లీ: దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవిడ్‌ కార్యదళం అధినేత, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ప్రజలకు సూచించారు. ఈ కొత్త రకం వైరస్‌ అధిక వేగంగా వ్యాప్తి చెందుతుందనిగానీ, టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందనిగానీ చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో సోమవారం ఆయన మాట్లాడారు. కొవిడ్‌ తదుపరి ఉద్ధృతి ఎప్పుడు వస్తుంది? దాని తీవ్రత ఎంతగా ఉండొచ్చు? అనేవి ఇప్పుడే అంచనా వేయలేమని పాల్‌ అభిప్రాయపడ్డారు. పలు కారకాలపై అది ఆధారపడి ఉంటుందని చెప్పారు. కరోనా నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ, కంటెయిన్‌మెంట్‌ వ్యూహాలను పక్కాగా అమలుచేస్తూ, టీకా పంపిణీని వేగంగా పూర్తిచేస్తే.. మరో ఉద్ధృతి రాకుండా అడ్డుకోవచ్చునని పేర్కొన్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అధిక వేగంతో వ్యాప్తిచెందుతుందనిగానీ, టీకాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందనిగానీ ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదన్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ డెల్టా వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఆందోళనకర కేసుల్లో పెరుగుదల

దేశంలో ఆందోళనకర వేరియంట్‌లకు చెందిన కరోనా కేసులు పెరుగుతున్నాయని పార్లమెంటరీ కమిటీకి అధికారులు నివేదించారు. గత నెలలో మొత్తం కేసుల్లో ఆందోళనకర వేరియంట్‌లకు సంబంధించినవి కేవలం 10.31% ఉండగా.. ఈ నెల 20 నాటికి 51%కు చేరుకున్నాయని తెలిపారు. నూతన వేరియంట్‌లపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు సమర్థంగానే పనిచేస్తున్నాయని.. ప్రామాణిక వేరియంట్‌తో పోలిస్తే మాత్రం వాటిపై కాస్త తక్కువ ప్రభావవంతంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీసంఘానికి (హోం వ్యవహారాలు) కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ తదితరులు సోమవారం ఈ మేరకు వివరాలు తెలియజేశారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా తదితర ఆందోళనకర వేరియంట్లు దేశవ్యాప్తంగా 174 జిల్లాల్లో వెలుగుచూశాయని వెల్లడించారు. అత్యధికంగా మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌ల్లో ఈ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు-డెసెంబరు మధ్య కాలంలో దేశంలో 135 కోట్ల డోసుల టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

కొవాగ్జిన్‌కు త్వరలోనే ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి ‘ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్‌)’ సర్టిఫికెట్‌ త్వరలోనే అందుతుందని వీకే పాల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘గత వారం కంపెనీ అదనపు పత్రాలను సమర్పించింది. ఆ డేటాపై వేగంగా సమీక్ష జరిగి, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన