అమెరికా వె‘నక్కి’ వెళుతోంది!

ప్రధానాంశాలు

Updated : 03/07/2021 11:14 IST

అమెరికా వె‘నక్కి’ వెళుతోంది!

అఫ్గాన్‌ బగ్రాం ఎయిర్‌ఫీల్డ్‌ అప్పగింత

కాబుల్‌: అల్‌ఖైదా ప్రభావం నుంచి... తాలిబన్ల చెర నుంచి అఫ్గానిస్థాన్‌కు స్వేచ్ఛ ప్రసాదిస్తామంటూ వచ్చిన అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోతోంది! లక్ష్యం సాధించి రొమ్ము విరుచుకొని కాకుండా... అశక్తంగా, రాజీపడి, తాలిబన్లతో ఒప్పందం చేసుకొని హడావుడి లేకుండా మెల్లగా స్వదేశానికి జారుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విధించిన సెప్టెంబరు 11 గడువు కంటే ముందే అమెరికా బలగాలు స్వదేశానికి తిరిగి వెళ్లేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో... 20 ఏళ్లుగా తన సైన్యం చేతుల్లో ఉన్న బగ్రాం ఎయిర్‌ఫీల్డ్‌ను ఖాళీ చేసి అఫ్గాన్‌ జాతీయ భద్రత దళాలకు శుక్రవారం అప్పగించింది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచే అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసింది. అల్‌ఖైదా ఉగ్రవాదులపై దాడులు చేసింది. వ్యూహాలను రచించింది! యుద్ధం తీవ్రంగా ఉన్న 2012 సమయంలో దాదాపు లక్షన్నర మంది సైనికులతో హడావుడిగా ఉన్న అమెరికా దళాలిప్పుడు... 2500-3000కు తగ్గిపోయాయి. వీరికి మద్దతుగా వచ్చిన నాటో దళాలు కూడా వెనక్కి మళ్లాయి.  ఇంతకూ.. అఫ్గానిస్థాన్‌లో చేసిన యుద్ధంలో అమెరికా గెలిచిందా? ఆ యుద్ధం ముగిసినట్లేనా అనేవి అసలు ప్రశ్నలు?

డబ్ల్యూటీవోపై దాడి (9/11) నేపథ్యంలో.. ఆగ్రహంతో ఊగిపోయిన అమెరికా-  లాడెన్‌ సారథ్యంలోని అల్‌ఖైదాను, తాలిబన్లను మట్టుపెటడానికంటూ అఫ్గాన్‌లో కాలుమోపింది.  తమ ప్రధాన శత్రువు లాడెన్‌ను హతమార్చిన తర్వాత అమెరికా పోరాటం క్రమంగా వేడి తగ్గింది. 2014 తర్వాత అమెరికా సేనలు దాడులు చేయటం దాదాపు ఆపేశాయి. ఒక్క ఉగ్రవాద వ్యతిరేక దళాలు మాత్రమే చురుగ్గా ఉన్నాయి. ట్రంప్‌ హయాంలో అఫ్గానిస్థాన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వచ్చిన జో బైడెన్‌ కూడా దీనికి ఓకే చెప్పారు. తమ దేశంపై దాడులకు అఫ్గానిస్థాన్‌ వేదిక కాకూడదంటూ తాలిబన్లతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి యుద్ధంలో ఎవరూ ఓడలేదు. ఎవరూ లొంగలేదు. అమెరికా సైన్యం మాత్రం వెళ్లిపోతోంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన