డెల్టా వేరియంట్‌లో ఆగని ఉత్పరివర్తన

ప్రధానాంశాలు

Updated : 04/07/2021 10:51 IST

డెల్టా వేరియంట్‌లో ఆగని ఉత్పరివర్తన

ప్రపంచం గడ్డు దశలో ఉందన్న డబ్ల్యూహెచ్‌ఓ

ఐరాస/జెనీవా: వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం గడ్డు దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ చెప్పారు. తక్కువ వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో ఆస్పత్రులు మరోసారి నిండిపోతున్నాయంటూ శుక్రవారం ఆయన హెచ్చరించారు. ‘‘డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో చాలా దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోంది. ఏ దేశమూ దీన్నుంచి బయటపడలేదు. ఈ వేరియంట్‌లో ఉత్పరివర్తన (మ్యుటేషన్‌) జరుగుతూనే ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా దేశాలన్నీ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసుకుని సిద్ధంగా ఉండాలి’’ అని సూచించారు. డెల్టా వేరియంట్‌ను తొలుత భారత్‌లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 98 దేశాలకు ఈ వేరియంట్‌ విస్తరించిందని, దీని ప్రభావం, వ్యాప్తిని తగ్గించేందుకు రెండు మార్గాలున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌తో వైరస్‌ మ్యుటేషన్లను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. ఐసోలేషన్‌, చికిత్స వసతులు మెరుగుపరచాలి. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూడాలని వివరించారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి అన్ని దేశాల్లో 70శాతం మందికి టీకాలు అందించేలా ప్రపంచ నేతలంతా కలిసి పనిచేయాలని టెడ్రోస్‌ మరోసారి పిలుపునిచ్చారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన