ప్రపంచానికి కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌

ప్రధానాంశాలు

Updated : 06/07/2021 13:10 IST

ప్రపంచానికి కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌

త్వరలో ఉచితంగానే అందిస్తాం
అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటన

దిల్లీ: కరోనా టీకా కార్యక్రమంలో భారత్‌ ఉపయోగిస్తున్న ‘కొవిన్‌’ అప్లికేషన్‌ను త్వరలోనే అందరికీ ఉచితంగా లభ్యమయ్యేలా ఓపెన్‌ సోర్స్‌గా మారుస్తామని, అన్ని దేశాలకూ అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. సోమవారం ఆయన ‘కొవిన్‌’ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఎంత శక్తిమంతమైన దేశమైనా కరోనా లాంటి మహమ్మారులను ఒంటరిగా ఎదుర్కోలేదు. ఈ మహమ్మారిపై పోరాటంలో ప్రారంభం నుంచి భారత్‌ తన అనుభవాలను, వనరులను అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటూనే ఉంది. పరిమితులున్నా.. ఎంత వీలైతే అంత పంచుకోవడానికే ప్రయత్నించాం. అదే సమయంలో మిగతా దేశాలు పాటించిన అత్యుత్తమ విధానాలనూ స్వీకరించాం. కొవిడ్‌పై మా పోరాటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది. అదృష్టవశాత్తూ సాఫ్ట్‌వేర్‌లో మాకు వనరుల కొరత లేదు. అందుకే ‘కొవిన్‌’ యాప్‌ను వీలైనంత త్వరలోనే ఓపెన్‌ సోర్స్‌గా మారుస్తాం. అన్ని దేశాలకూ అందుబాటులోకి తెస్తాం’’ అని మోదీ తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిని పారద్రోలాలంటే వ్యాక్సినేషనే మార్గమని, అందుకే ఈ కార్యక్రమంలో భారత్‌ పూర్తి డిజిటల్‌ విధానాన్ని అవలంబించిందని మోదీ చెప్పారు. సదస్సును ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ శ్రింగ్లా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, గయానా, జాంబియా సహా 142 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

76 దేశాలు ఆసక్తి

ఈనాడు దిల్లీ: భారత వ్యాక్సినేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ‘కొవిన్‌’ అప్లికేషన్‌పై దాదాపు 76 దేశాలు ఆసక్తి చూపిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆసక్తి గల దేశాలందరికీ ఈ డిజిటల్‌ సాంకేతికతను ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే భారత ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను వాణిజ్య ప్రయోజనాలకు, మార్పులు చేర్పులు చేసి తిరిగి అమ్మడానికి ప్రయత్నించరాదని స్పష్టం చేసింది. కొవిన్‌ అప్లికేషన్‌ను కేంద్రం జనవరి 16న ప్రారంభించింది. తొలి 4 నెలల్లోనే 20 కోట్ల మంది దీనిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జులై 1కి ఈ సంఖ్య 35.4 కోట్ల మందికి చేరుకుంది.

యాప్‌లో మరిన్ని మార్పులు

* అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వ్యక్తుల సౌలభ్యం కోసం వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలకు పాస్‌పోర్ట్‌ నంబర్లను జోడించనున్నారు.
* వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాల్లో వ్యక్తిగత వివరాలను సవరించుకునే అవకాశాన్నీ కల్పించారు. ‘‘కొందరు నమోదు చేసుకునేటపుడు పేరు, పుట్టిన తేదీ తదితర వ్యక్తిగత వివరాలను తప్పుగా నమోదు చేస్తున్నారని గుర్తించాం. అలాంటివారు ‘కొవిన్‌’లో  సవరణలు చేసుకోవచ్చు’’ అని ఓ అధికారి తెలిపారు.
* పొరపాటున రెండు డోసులను రెండు వేర్వేరు యూజర్‌ ఖాతాలతో తీసుకున్నవారు.. ఇక నుంచి ఆ రెండు వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలను కలుపుకొనేలా వీలు కల్పించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన