సెక్షన్‌ 66ఏ కింద కేసులు పెట్టొద్దు

ప్రధానాంశాలు

Updated : 15/07/2021 07:28 IST

సెక్షన్‌ 66ఏ కింద కేసులు పెట్టొద్దు

రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశం

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టులు, శిక్షలు ఉండవు

ఈనాడు, దిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్‌ 66ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సెక్షన్‌ను 2015లోనే కొట్టేసినప్పటికీ దీని కింద కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక మీదట రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనూ దీని కింద కేసులు నమోదు చేయకూడదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బుధవారం అడ్వయిజరీ పంపించారు. ఈ సెక్షన్‌ కింద నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించాలని ఆదేశించారు. 2015 మార్చి 24న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని సూచించారు. కంప్యూటర్లు, ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు, సామాజిక మాధ్యమాల నుంచి అభ్యంతరకర సందేశాలు పంపితే శిక్షించడానికి ఈ సెక్షన్‌ వీలు కల్పిస్తూ వచ్చింది. ఈ సందేశాన్ని చూసిన వెంటనే బాధ్యున్ని పోలీసులు అరెస్టు చేయవచ్చు. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సెక్షన్‌ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది ఉనికి కోల్పోయినట్టయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన