రాజకీయాలకు అతీతంగా.. కరోనాపై పోరాటం

ప్రధానాంశాలు

Published : 21/07/2021 04:41 IST

రాజకీయాలకు అతీతంగా.. కరోనాపై పోరాటం

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు.. భేటీకి కాంగ్రెస్‌ డుమ్మా 

కొవాగ్జిన్‌కు త్వరగా అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా కృషి చేయాలన్న పార్టీలు

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ జట్టుగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిలషించారు. ఈ పోరాటంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దామని పార్టీలకు పిలుపునిచ్చారు. కరోనా విషయంలో ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులను, దాని నియంత్రణకు తాము చేపడుతున్న చర్యలను వివరించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ఈ మేరకు ప్రసంగించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, తెరాస సహా పలు విపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ గైర్హాజరైంది. కొవాగ్జిన్‌కు అంతర్జాతీయ గుర్తింపును సాధించిపెట్టే ప్రక్రియను వేగవంతం చేయాలని పలు పార్టీలు సమావేశంలో డిమాండ్‌ చేశాయి.

మరికొన్ని కంపెనీలకు చెందిన కరోనా టీకాలు త్వరలోనే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమావేశంలో ప్రధాని తెలిపారు. వ్యాక్సిన్ల లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. కరోనా సోకిన జనాభా శాతం పరంగా చూస్తే.. చాలా దేశాల కంటే భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. బ్రిటన్‌ వంటి కొన్ని దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతిని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మన దగ్గర రాకూడదంటే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఈ సమావేశంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం వివిధ పార్టీల నేతలు కరోనాకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. తమ సూచనలు ఇచ్చారు. దేశీయ టీకా ‘కొవాగ్జిన్‌’కు త్వరగా అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకోవాలని బిజూ జనతాదళ్‌, తృణమూల్‌ సహా మరికొన్ని పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. మహారాష్ట్రకు మరిన్ని టీకాలు కేటాయించాలని శివసేన, పశ్చిమ బెంగాల్‌కు వ్యాక్సిన్ల కేటాయింపు పెంచాలని తృణమూల్‌ కోరాయి. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని తెరాస నేత నామా నాగేశ్వరరావు విన్నవించారు. కరోనా రెండో ఉద్ధృతి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం మోదీ అలుపెరుగకుండా కృషిచేశారని మాజీ ప్రధాని దేవేగౌడ కితాబిచ్చారు.

..అందుకే హాజరు కాలేదు: ఖర్గే

అఖిలపక్ష సమావేశానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తదితరులు హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌, బిజూ జనతాదళ్‌ నేత పినాకి మిశ్రతో పాటు తెరాస, బీఎస్పీ సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌, అకాలీదళ్‌, వామపక్షాలు సమావేశానికి గైర్హాజరయ్యాయి. కొవిడ్‌ పరిస్థితులను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వం వివరించాలని తాము కోరుకుంటున్నామని.. అందుకే సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన