అక్కడి నుంచి వస్తే ‘కొవిడ్‌ నెగెటివ్‌’ తప్పనిసరి..

ప్రధానాంశాలు

Updated : 21/07/2021 06:18 IST

అక్కడి నుంచి వస్తే ‘కొవిడ్‌ నెగెటివ్‌’ తప్పనిసరి..

ఎక్కవ పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణయం

లఖ్‌నవూ: కొవిడ్‌ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయమై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వారపు పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే వారికి కొవిడ్‌ ‘నెగెటివ్‌’ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. ఆగస్టు 1 నుంచి 15 మధ్య వచ్చేవారికి ఈ నిబంధన వర్తిస్తుందని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ మంగళవారం తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేసే ప్రయాణాలన్నింటికీ ఇది వర్తిసుందని స్పష్టం చేశారు. అలాంటి ప్రయాణికులంతా 4 రోజుల్లోపు తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును లేదా రెండు డోసులు తీసుకున్నట్లు వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఈ నిబంధన ఉండదని పేర్కొన్నారు. ఈమేరకు జులై 16-22 వారానికి నమోదైన పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకుంటామని.. 3%కి మించి ఉన్న రాష్ట్రాల పేర్లను ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవల వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అస్సాం వచ్చే అందరికీ ఇక కొవిడ్‌ పరీక్షలు..

ఈనాడు, గువాహటి: అస్సాంకు విమానాలు, రైళ్లలో వచ్చే వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి ఇంతవరకు కొన్ని మినహాయింపులు ఉండేవి. వాటన్నింటినీ నిలిపివేస్తూ తాజాగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి అస్సాం ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ఆర్టీ-పీˆసీˆఆర్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలితాలను బట్టి నిబంధనలను నిర్దేశిస్తోంది. ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఉండేది. దీన్ని రద్దు చేసింది. ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడి నుంచి వచ్చే ప్రజలు కూడా ఇకపై ఈ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవలసిందేనని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన