ప్రధానే స్వయంగా జవాబు చెప్పాలి

ప్రధానాంశాలు

Published : 23/07/2021 06:10 IST

ప్రధానే స్వయంగా జవాబు చెప్పాలి

పెగాసస్‌పై విపక్షాల పట్టు
పార్లమెంటులో గందరగోళం
 హ్యాకింగ్‌ అవాస్తవం : మంత్రి
ఆయన చేతిలో నుంచి పత్రాలు లాక్కొన్న తృణమూల్‌ ఎంపీ

దిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన స్పై వేర్‌ ‘పెగాసస్‌’ సాయంతో దేశంలో నిఘా పెట్టిన వ్యవహారం గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. గందరగోళం నెలకొనడంతో పెద్దగా చర్చలేవీ కొనసాగలేదు. రాజ్యసభలో అయితే మంత్రి నుంచి కాగితాలు లాక్కొని చించివేసే పరిస్థితి ఎదురయింది. దీనిపై స్వయంగా ప్రధానే సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభం కాగానే వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ అకాలీదళ్‌, కాంగ్రెస్‌ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారు. పెగాసస్‌ వ్యవహారంపై ప్రధాని మోదీయే సమాధానం ఇవ్వాలంటూ తృణమూల్‌ సభ్యులు పోడియం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వైకాపా ఆందోళనకు దిగింది. తొలుత స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయం చేపట్టగా కేవలం 12 నిమిషాల పాటే కొనసాగింది. ఒక్క ప్రశ్నే ప్రస్తావనకు నోచుకుంది. ప్రశాంతత లేకపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యలో రెండుసార్లు తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. గందరగోళం నడుస్తున్నప్పుడే అత్యవసర రక్షణ సేవల బిల్లు, అంతర్గత జల రవాణా బిల్లును ప్రవేశపెట్టారు.

విపక్ష సభ్యులపై ప్రభుత్వం ఫిర్యాదు

సభ వాయిదా వేసిన తరువాత కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. అధికారపక్ష సభ్యులపై అమర్యాదకరంగా ప్రవర్తించిన కొందరు విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయనుంది. ముఖ్యంగా తృణమూల్‌ ఎంపీ శంతను సేన్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ శుక్రవారం సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.\

మంత్రే కొట్టడానికి వచ్చారు: టీఎంసీ

దీనిపై తృణమూల్‌ సభ్యుడు సేన్‌ స్పందిస్తూ కేంద్ర మంత్రి హర్దీప్‌ పురి సభలోనే తనను దూషించారని చెప్పారు. కొట్టడానికి ముందుకు రావడంతో తోటి సభ్యులు అడ్డుకున్నారని తెలిపారు. తనను భాజపా సభ్యులు ఘెరావ్‌ చేశారని ఆరోపించారు. సభ వాయిదా పడి టీవీ కెమేరాలు ఆగిపోయినప్పుడు ఇది జరిగిందని చెప్పారు. దీనిపై పురి ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చాలు

‘ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగించిందా? లేదా?’ ఈ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబితే చాలని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ డిమాండు చేశారు. ఆ పార్టీ చీఫ్‌ విప్‌ సుఖేందు శేఖర్‌ మాట్లాడుతూ మంత్రి ప్రకటన పరస్పర విరుద్ధంగా, శుద్ధ తప్పులతో నిండి ఉండడంతో తమ సభ్యుడు ఒకరు దాన్ని లాక్కొని చించివేశారని చెప్పారు. దీనిపై అర్ధవంతమైన చర్చ జరిగే వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు.
రాజ్యసభలో గందరగోళం
రాజ్యసభ ప్రారంభం కాగానే పెగాసస్‌ స్పైవేర్‌,  దైనిక్‌ భాస్కర్‌ పత్రిక కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడుల అంశాలపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. సీట్లలోకి వెళ్లాలని ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గకపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో మళ్లీ 2 గంటల వరకు వాయిదా వేశారు. సభానేత.. మంత్రి పీయూష్‌ గోయల్‌, మరో మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలు విపక్ష నేతలతో చర్చలు జరిపారు. సభ్యుల ప్రశ్నలకు ఐటీ మంత్రి సమాధానం ఇస్తారని హామీ ఇచ్చారు.

ప్రజాస్వామ్యంపై దాడి : మంత్రి

సభ తిరిగి ప్రారంభమయినప్పుడు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటన చేస్తూ ఫోన్లు హ్యాక్‌ అయ్యాయన్న ఆరోపణల్ని ఖండించారు. ‘‘గతంలో వాట్సప్‌కు సంబంధించి ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు ఇలా చేస్తున్నారు’’ అని చెప్పారు. మంత్రి మాట్లాడుతుండగానే తృణమూల్‌ సభ్యుడు శంతను సేన్‌ ఆయన చేతిలోని ప్రతులను లాక్కొని, చించివేసి గాల్లోకి విసిరారు. మంత్రికి మరో ప్రతి అందించినా చదవలేని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాట్లాడటం ఆపేసిన మంత్రి తన ప్రకటన ప్రతులను సభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. సభ్యులు అమర్యాదగా ప్రవర్తించటం మానుకోవాలని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ కోరారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన