హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు

ప్రధానాంశాలు

Published : 26/07/2021 04:03 IST

హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు

రెండు ముక్కలైన వంతెన

9 మంది పర్యాటకుల మృతి

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సాంగ్లా లోయలో కొండచరియలు విరిగిపడి పర్యాటకుల వాహనంపై పడడంతో తొమ్మిది మంది మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సాంగ్లా-చిట్కుల్‌ మార్గంలో బట్సేరి దగ్గర ఆదివారం మధ్యాహ్నం 1.25 గంటలకు కొండలపై నుంచి బండరాళ్లు లోయలోకి జారిపడ్డాయి. పై నుంచి దొర్లుకుంటూ వచ్చిన భారీ రాయి ఒకటి నేరుగా వంతెనపై పడడంతో ఆ కట్టడం రెండు ముక్కలైంది. పర్యాటకులతో ఉన్న టెంపో ట్రావెలర్‌పై మరో పెద్దరాయి పడడంతో అందులో ఉన్న 11 మందిలో తొమ్మిది మంది మరణించినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించినవారిలో రాజస్థాన్‌కు చెందినవారు నలుగురు, ఛత్తీస్‌గఢ్‌- ఇద్దరు, మహారాష్ట్ర- ఒకరు, దిల్లీ వాసులు ఇద్దరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిన్నౌర్‌ జిల్లాలోనే జరిగిన ఇదే తరహా ఘటనలో ఒకరు గాయపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినందున కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం ఇటీవలే ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడుతున్న ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. భూకంపం సంభవించినట్లు ఒక్కసారిగా.. కొండ పైనుంచి బండ రాళ్లు కిందకు వేగంగా దూసుకొచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో పలు వాహనాలు, విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలను పలువురు పర్యాటకులు తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు.

రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌,  ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి  చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రధాని తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన