సర్కారు మొండితనం వల్లే పార్లమెంటు సాగడం లేదు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 05:54 IST

సర్కారు మొండితనం వల్లే పార్లమెంటు సాగడం లేదు

ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు
స్పైవేర్‌తో దేశ భద్రతకు ముప్పుందని ఆందోళన

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగంపై ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడం వల్లే పార్లమెంటు సమావేశాలు ముందుకు సాగడంలేదని కాంగ్రెస్‌ విమర్శించింది. పెగాసస్‌తో దేశ భద్రతకు ముప్పుందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పెగాసస్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలని సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. నినాదాల హోరుతో గందరగోళం నెలకొంది. దీంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు అవకాశం లేకపోయింది. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో పలువురు విపక్ష నేతలు సమావేశమయ్యారు. అనంతరం స్పైవేర్‌పై చర్చ కోరుతూ 267వ నిబంధన కింద నోటీసులిచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యాన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఫోన్‌ ట్యాంపరింగ్‌తో వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. పెగాసస్‌తో దేశ భద్రతకు తీవ్ర ముప్పుంది. బయటి సంస్థల సాఫ్ట్‌వేర్‌తో దేశంలోని రాజకీయ నాయకులు, అధికారులు, పాత్రికేయులపై నిఘా పెడితే... కీలక సమాచారం విదేశాలకు చిక్కుతుంది. దీంతో దేశ వ్యూహాలు బెడిసికొట్టి, భద్రత, రక్షణ సవాళ్లు ఎదురవుతాయి. ఎంతో ముఖ్యమైన ఈ అంశంపై తక్షణం చర్చ చేపట్టాలి’’ అని ఖర్చే పేర్కొన్నారు. అయితే- కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, సీపీఐ సభ్యుల నుంచి 267వ నిబంధన కింద వచ్చిన నోటీసులను అనుమతించడం లేదని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తేల్చిచెప్పారు. ‘‘విపక్షాలన్నీ పెగాసస్‌పై చర్చకు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడం వల్లే పార్లమెంటు స్తంభించిపోయింది’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన