కేంద్రం-దీదీ విభేదాలు మరింత ఘాటు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:10 IST

కేంద్రం-దీదీ విభేదాలు మరింత ఘాటు

‘పెగాసస్‌’పై విచారణ సంఘాన్ని నియమించిన మమత

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... మోదీ సర్కారును ఇరుకునపెట్టే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వివాదాస్పద ‘పెగాసస్‌ స్పైవేర్‌’పై ఆమె విచారణ సంఘాన్ని ఏర్పాటుచేశారు. పశ్చిమ బెంగాల్‌ రాజకీయ నాయకులు, అధికారులు, పాత్రికేయుల ఫోన్లను ట్యాప్‌ చేశారన్న ఆరోపణలపై ఈ కమిషన్‌ విచారణ చేపట్టనుంది. కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ భీంరావ్‌ లోకుర్‌లు ఇందులో సభ్యులు. ఈ కమిషన్‌ నియామకాన్ని రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది.

ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను కలిసికట్టుగా ఎదుర్కొనే అంశంపై ప్రతిపక్ష నేతలతో చర్చించేందుకు మమత సోమవారం దిల్లీ బయల్దేరి వెళ్లారు. అందుకు కొద్దిసేపటి ముందే ఆమె ఈ నిర్ణయం వెల్లడించారు. ‘‘ఫోన్ల హ్యాకింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉంది? ఏవిధంగా వారు నిఘా పెడుతున్నారు? ఇతరులు మౌనం వహించేలా ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? అన్నది ఈ కమిషన్‌ తేల్చుతుంది’’ అని దీదీ చెప్పారు.

చట్టం ఏం చెబుతోంది?

కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌-1952 ప్రకారం... ఏదైనా అంశంపై కేంద్రం, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ సంఘాన్ని నియమించవచ్చు. అయితే- కేంద్ర ప్రభుత్వమే మొదట కమిషన్‌ను నియమిస్తే, అది అమల్లో ఉన్నంతకాలం మళ్లీ అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేరే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. ఒకవేళ మరో కమిషన్‌ను నియమించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే విచారణ సంఘాన్ని నియమిస్తే... మరిన్ని రాష్ట్రాలకు ఆ విచారణను వర్తింపజేస్తే తప్ప కేంద్రం కూడా మరో ఎంక్వయిరీ కమిషన్‌ వేయకూడదు.

కేంద్రంపై ఒత్తిడికి ఎత్తుగడ...

‘‘పెగాసస్‌ అంశంపై కేంద్రం స్పందించి కోర్టు పర్యవేక్షణలో విచారణ సంఘాన్ని నియమిస్తుందని భావించాం. కానీ, మోదీ సర్కారు అచేతనంగా ఉండిపోయింది. కొన్నిసార్లు నిద్రపోతున్న వాళ్లను మనమే లేపాల్సి ఉంటుంది. అందుకే మేమే కమిషన్‌ వేశాం’’ అని మమత చెప్పారు. ఈ ఎత్తుగడ ద్వారా కేంద్రం విస్తృత స్థాయిలో విచారణ నిమిత్తం కమిషన్‌ను ఏర్పాటుచేసేలా మమత ఒత్తిడి తెచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన