పొలాలనూ దున్నగలం.. దేశాన్నీ నడపగలం

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:10 IST

పొలాలనూ దున్నగలం.. దేశాన్నీ నడపగలం

‘కిసాన్‌ సంసద్‌లో మహిళా రైతుల గర్జన

దిల్లీ: పొలాలనూ దున్నగలం, దేశాన్నీ నడపగలమని సోమవారం దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో జరిగిన ‘కిసాన్‌ సంసద్‌’లో మహిళా రైతులు గర్జించారు. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని కోరారు. పంజాబ్‌, హరియాణా, యూపీకి చెందిన 200 మంది మహిళా రైతులు ఈ సంసద్‌లో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు సభ మహిళా శక్తిని చాటిచెప్పింది. మహిళలు పొలాలనూ దున్నగలరు. దేశాన్నీ నడపగలరు’’అని స్పీకర్‌గా వ్యవహరించిన సుభాషిణి అలీ తెలిపారు. రైతు నాయకురాలు నీతూ ఖన్నా మాట్లాడుతూ.. కనీస మద్దతుధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలూ పాలుపంచుకుంటున్నారని హరీందర్‌ బిందు అనే మహిళా రైతు పేర్కొన్నారు.  హరియాణా మహిళా రైతు కిరణ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ఈ ఆందోళన తమ బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ‘‘రోదసిలోకి కల్పనా చావ్లా వెళ్లింది. మేం కేవలం దిల్లీకి మాత్రమే వచ్చాం.  మా సమస్యలపై మేం పోరాడలేమా’’ అని కుల్విందర్‌ అనే మహిళా రైతు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

* వ్యవసాయ చట్టాలను  షరతులు లేకుండా కేంద్రం ఉపసంహరించుకోవాలని బీకేయూ నేత రాకేష్‌ టికాయిత్‌ డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం లఖ్‌నవూలో విలేకరులతో  మాట్లాడారు. తమ డిమాండును కేంద్రం  పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా సెప్టెంబరు 5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో భారీఎత్తున కిసాన్‌ పంచాయతీ నిర్వహిస్తామని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన