దిల్లీలో మమత బిజీబిజీ.. ప్రధానితో భేటీ

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 11:52 IST

దిల్లీలో మమత బిజీబిజీ.. ప్రధానితో భేటీ

దిల్లీ: రాజకీయ లక్ష్యాలతో దిల్లీ చేరిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ... మంగళవారం బిజీబిజీగా గడిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, ఆనంద్‌ శర్మలతో మంతనాలు సాగించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితర విపక్ష నేతలను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పనిలోపనిగా ప్రధాని మోదీతో దీదీ మంగళవారం సమావేశమయ్యారు. కరోనా టీకాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించిన తర్వాత మమత దిల్లీ వచ్చి, ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘టీకాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. పెగాసస్‌ వ్యవహారంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించాను’’ అని తెలిపారు.

ఎన్డీయే వ్యతిరేక పక్షాల ఐక్యత స్వతహాగానే రూపుదిద్దుకొంటుందని, ఈ ఐక్యతను దేశమే నడిపిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మమత చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో బుధవారం సాయంత్రం లేదా గురువారం దీదీ సమావేశం కానున్నారు. ఈ భేటీని ‘చాయ్‌ పే చర్చ’’గా మమత పేర్కొన్నారు.

మమతను కలుస్తా: పవార్‌

ముంబయి: తృణమూల్‌ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీతో బుధవారం దిల్లీలో సమావేశం కానున్నట్టు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తెలిపారు. భాజపా వ్యతిరేక పక్షాలు కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే అంశంపై ఆమెతో చర్చించే అవకాశముందన్నారు.


జాతీయ ఎజెండా ఏమిటి?

దిల్లీ బయల్దేరడానికి కొద్దిసేపటి ముందు... ‘పెగాసస్‌’ గూఢచర్యంపై మాజీ న్యాయమూర్తులతో రాష్ట్రస్థాయి విచారణ కమిటీని నియమించి, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించారు మమత. పార్లమెంటు సభ్యురాలు కాకపోయినా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించకపోయినా... తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మమత ఎన్నికవడం ఆమె జాతీయ ఆకాంక్షలకు అద్దం పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీచేసి ఓడిపోయినా ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే ఆరు నెలల్లోపు, అంటే నవంబరు 4లోగా ఉప ఎన్నికల్లో నెగ్గాల్సి ఉంది. అప్పటికి ఉపఎన్నికలు జరిగి, ఫలితాలు వెలువడతాయా? అన్నది అనుమానమే. కొవిడ్‌ మూడో ఉద్ధృతి కారణంగా ఉపఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయవచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన దీదీ, తన దృష్టిని బెంగాల్‌ నుంచి దిల్లీ వైపు మళ్లిస్తున్నట్టు భావిస్తున్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన