ఆందోళనకరంగా ఆర్‌ ఫ్యాక్టర్‌

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:19 IST

ఆందోళనకరంగా ఆర్‌ ఫ్యాక్టర్‌

  8 రాష్ట్రాల్లో 1 దాటింది..

  44 జిల్లాల్లో 10%కి మించి కరోనా పాజిటివిటీ రేటు

  హెచ్చరించిన కేంద్రం

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి (సెకెండ్‌ వేవ్‌) ముగిసిపోలేదని.. జాగ్రత్తలు పాటించడంలో, కరోనా కట్టడి చర్యల్లో నిర్లక్ష్యానికి చోటివ్వొద్దని పదేపదే చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి హెచ్చరించింది. 8 రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతను తెలిపే ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ (రీప్రొడక్షన్‌ నంబర్‌) 1 దాటినట్లు మంగళవారం తెలిపింది. ఈమేరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి చెందుతోందని.. రెండో ఉద్ధృతి తీవ్రంగానే ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పునరుద్ఘాటించారు. ‘‘ఆర్‌ ఫ్యాక్టర్‌ 0.6 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అది 1 దాటితే కొవిడ్‌ వ్యాప్తి తీవ్రతను తెలుపుతుంది’’ అని పేర్కొన్నారు. గణాంకాలతో సహా ఆయన కొవిడ్‌ పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌, నాగాలాండ్‌, హరియాణా, గోవా, దిల్లీ, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఆర్‌ ఫ్యాక్టర్‌ 1గా ఉన్నట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా ఆగస్టు 2తో ముగిసిన వారానికి 12 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం మించి నమోదైనట్లు తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ సహా 6 రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో గత 4 వారాలుగా రోజువారీ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. దేశంలో గత వారం నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం ఒక్క కేరళలోనే బయట పడ్డాయన్నారు. ఆర్‌ ఫ్యాక్టర్‌ 1 దాటిన చోట కొవిడ్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు అవసరమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. నిపుణుల గణన ప్రకారం.. ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ 1 అంటే కొవిడ్‌ బారిన పడిన ప్రతిఒక్కరి ద్వారా మరొకరికి ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందడం. అదే 1 దాటితే వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరి ద్వారా ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చెందుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన