ఆరుగురు తృణమూల్‌ ఎంపీల సస్పెన్షన్‌

ప్రధానాంశాలు

Published : 05/08/2021 04:57 IST

ఆరుగురు తృణమూల్‌ ఎంపీల సస్పెన్షన్‌

ఒకరోజుపాటు వేటువేస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ నిర్ణయం
పార్లమెంటులో కొనసాగిన విపక్ష నిరసనలు

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌పై నిరసనలు వ్యక్తం చేసే క్రమంలో సభలో నినాద ఫలకాలు (ప్లకార్డులు) ప్రదర్శిస్తున్నందుకు ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఫోన్ల నిఘాపై ఇతర ఎంపీలతో కలిసి వారంతా నినాదాలిచ్చారు. ఆ ఆరుగురిని బుధవారం మిగిలిన సమయమంతా సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. లోక్‌సభలోనూ నిరసనలు కొనసాగాయి. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభలో మూడు, లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అనంతరం గురువారానికి వాయిదా పడ్డాయి.

సడలని పట్టు

పెగాసస్‌, నూతన సాగు చట్టాలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు ఉభయసభల్లో పెద్దఎత్తున నినాదాలిస్తూ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఉదయం 11 గంటలకు సమావేశమైన ఉభయ సభల్లో.. ఆద్యంతం వాయిదాల పర్వమే కొనసాగింది. పెగాసస్‌ నిఘా, వ్యవసాయ చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

వెంకయ్యనాయుడు అసంతృప్తి

రాజ్యసభలో సభ్యుల తీరుపై వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలను పూర్తిగా జరగనివ్వొద్దని కొన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం- విపక్షాలు అవగాహనతో పనిచేయాలని కోరారు. సభా కార్యకలాపాలు మొదలుకావడానికి ముందు, తొలి వాయిదా తర్వాత వివిధ పార్టీల నేతలతో ఛైర్మన్‌ విడిగా చర్చించారు. 

ప్రభుత్వానిదే బాధ్యత: విపక్షాలు

పెగాసస్‌ నిఘా, రైతు సమస్యలు వంటి అన్ని అంశాలపై పార్లమెంటు చర్చించాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసినట్లు కాంగ్రెస్‌ సహా 14 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రతిష్టంభనకు తామే కారణమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, నిజానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నాయి. విపక్షాలను చీల్చేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని తృణమూల్‌ వ్యాఖ్యానించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన