సుదీర్ఘ సంక్షోభమిది.. స్పష్టంగా చెప్పలేం

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 06:14 IST

సుదీర్ఘ సంక్షోభమిది.. స్పష్టంగా చెప్పలేం

కొన్నిచోట్ల కొవిడ్‌ కేసులుగా గుర్తించనేలేదు
మరణాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ

దిల్లీ: ‘కరోనా మహమ్మారి వంటి సుదీర్ఘమైన ప్రజారోగ్య సంక్షోభం తలెత్తినపుడు మరణాల సంఖ్య నమోదులో కొన్ని తేడాలు రావడం సహజమన్నది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో కొవిడ్‌-19 కేసులు కొన్నిచోట్ల నిబంధనల మేరకు గుర్తించలేదు. క్షేత్రస్థాయిలో అమలులో ఉన్న సాధారణ నమోదు విధానం మేరకు నివేదికలు రూపొందించినందున మరణాల సంఖ్యలో స్పష్టత రావడం లేదు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వివరణ ఇచ్చింది. రెండోదశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో దేశంలో వైద్య యంత్రాంగం మొత్తం ఈ మహమ్మారిని ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టిందన్నారు. ఈ కారణంగా కొవిడ్‌ మరణాల కచ్చితమైన వివరాలు నమోదు చేయడంలో ఆలస్యమైందని, తదుపరి క్రమంలో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ లెక్కలను సరిచేస్తూ వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఈ విషయమై వచ్చిన ఊహాగానాలు, ఆరోపణలకు సమాధానంగా కొవిడ్‌ మరణాల కచ్చితమైన నమోదు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. 8 రాష్ట్రాల్లో కరోనా మరణాలను తగ్గించి చూపారని మీడియాలో వచ్చిన కథనాలకు వివరణ ఇస్తూ.. ‘ఇలాంటి సందర్భాల్లో మరణాలు అంచనా వేయగలం.. కచ్చితమైన వివరాలు ఎప్పటికీ తెలియవు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. దేశంలో అందుబాటులో ఉన్న సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం (సీఆర్‌ఎస్‌), హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (హెచ్‌ఎంఐఎస్‌)ల ఆధారంగా మరణాల నివేదికలు రూపొందాయని తెలిపింది. మరణాల రేటు నమోదులోనూ ఇవే ప్రమాణాలు పాటించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది. 2020 డిసెంబరు 31 నాటికి 1.45 శాతంగా ఉన్న ఈ రేటు 2021 ఏప్రిల్‌, మే నెలల్లో ఉద్ధృతంగా కేసులు నమోదయినప్పటికీ 1.34 శాతం నమోదైనట్టు వివరించారు. మరణాల నమోదులో గందరగోళం నివారించడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) గతేడాది మే నెలలోనే ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల మేరకు కొన్ని సూచనలు చేసినట్టు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున కూడా ఈ విషయమై రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను పలువిధాలుగా అప్రమత్తం చేశామన్నారు. ఇదే క్రమంలో మరణాల వివరాలు కచ్చితంగా అందించాలని, జిల్లాల వారీగా పట్టిక సైతం ఇవ్వాలంటూ బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన