బూస్టర్‌ డోస్‌ను రెండు నెలలు వాయిదా వేయండి: డబ్ల్యూహెచ్‌వో

ప్రధానాంశాలు

Updated : 24/08/2021 06:03 IST

బూస్టర్‌ డోస్‌ను రెండు నెలలు వాయిదా వేయండి: డబ్ల్యూహెచ్‌వో

బుడాపెస్ట్‌: కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడంలో ప్రపంచంలో నెలకొన్న అసమానతలను తగ్గించడానికి వీలుగా బూస్టర్‌ డోస్‌పై రెండు నెలల మారటోరియం విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌లో కొత్త రకాలను నివారించాలన్నా ఇలా చేయడం అవసరమని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ ఘెబ్రియేసస్‌ సోమవారం హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలో చాలా దేశాలు తమ జనాభాలో అనేక మందికి ఇప్పటికీ తొలి రెండు డోసుల్ని ఇవ్వలేకపోయాయి. సంపన్న దేశాల వద్ద మాత్రం టీకాల నిల్వలు పుష్కలంగా ఉంటున్నాయి. ఇది ఎంతో నిరుత్సాహకరం. ఈ పరిస్థితుల్లో మూడో డోసు వేసేందుకు సంసిద్ధమవుతున్న దేశాలు వాటిని ఇతర దేశాలకు పంపడం మేలు’ అని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌, హంగేరీ వంటి పలు దేశాలు బూస్టర్‌ డోసుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అధానమ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో 480 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి అయితే కేవలం పది దేశాలకే దానిలో 75% వెళ్లిందని, ఆఫ్రికాలో టీకాలు వేసుకున్నవారు రెండు శాతం కంటే తక్కువే ఉన్నారని ఆయన చెప్పారు. వ్యాక్సిన్లు తక్కువగా వేసిన దేశాలకు కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఉందనీ, డెల్టా రకం మరింతగా విజృంభించవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన