నిష్క్రమణే అత్యుత్తమ నిర్ణయం

ప్రధానాంశాలు

Published : 02/09/2021 04:37 IST

నిష్క్రమణే అత్యుత్తమ నిర్ణయం

అఫ్గాన్‌లో దశాబ్దం క్రితమే లక్ష్యాన్ని సాధించాం

బలగాల ఉపసంహరణను సమర్థించుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌, లండన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి తమ బలగాల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. అదే అత్యుత్తమ నిర్ణయమని పేర్కొన్నారు. ఇతర దేశాల పునర్నిర్మాణం కోసం సైనిక మోహరింపులు చేపట్టే యుగానికి తాజా పరిణామంతో తెరపడిందని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అఫ్గాన్‌ నుంచి తమ బలగాలు నిష్క్రమించిన నేపథ్యంలో.. అమెరికా ప్రజలను ఉద్దేశించి బైడెన్‌ ప్రసంగించారు. ‘‘మన ముందుకు రెండు ఐచ్ఛికాలు వచ్చాయి. ఒకటి- అఫ్గాన్‌ నుంచి సైనికులను వెనక్కి రప్పించడం. రెండు- ఉద్రిక్తతలను మరింత పెంచడం. వీటిలో సరైన, తెలివైన నిర్ణయాన్నే తీసుకున్నాం. అఫ్గాన్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మనం దశాబ్దం క్రితమే సాధించాం. మరో పదేళ్ల పాటు అక్కడే ఉన్నాం. ఆ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది. ముగించేశాం. అఫ్గాన్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కేవలం ఒక్క దేశానికే సంబంధించినది కాదు. ఇతర దేశాల పునర్నిర్మాణానికి భారీగా సైనిక మోహరింపులు చేపట్టే యుగానికీ ముగింపు పలకడానికి సంబంధించినది. అఫ్గాన్‌లో యుద్ధం కోసం మనం రోజుకు 30 కోట్ల డాలర్ల చొప్పున రెండు దశాబ్దాల పాటు ఖర్చు చేశాం. అమెరికన్లకు ఏమాత్రం ప్రయోజనం లేనప్పుడు ఇంకా ఆ దేశంలో కొనసాగడం వ్యర్థం. అక్కడి యుద్ధానికి తెరదించుతానని.. దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు నేను హామీ ఇచ్చాను. ప్రస్తుతం దాన్ని నిలబెట్టుకున్నాను’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

అల్‌ షబాబ్‌, అల్‌ఖైదా అనుబంధ సంస్థలు, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రమూకల వల్ల ఎదురవుతున్న ముప్పుల నుంచి అమెరికాను పరిరక్షిస్తానని బైడెన్‌ ప్రతినబూనారు. అఫ్గాన్‌ సహా ఇతర దేశాల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అయితే అందుకోసం క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల అఫ్గాన్‌లో ఐఎస్‌ఐఎస్‌-కె ముష్కరులను సుదూర ప్రాంతం నుంచే మట్టుబెట్టిన సంగతిని గుర్తుచేశారు. రష్యా, చైనా వంటి శక్తిమంతమైన ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సవాళ్లనూ తమ దేశం ఎదుర్కోవాల్సి ఉందని బైడెన్‌ చెప్పారు. ‘‘చైనాతో మనకు తీవ్ర పోటీ ఉంది. రష్యా నుంచి కూడా అనేక వేదికలపై సవాళ్లు ఎదురవుతున్నాయి. సైబర్‌ దాడులు, అణువ్యాప్తి వంటి ముప్పులనూ ఎదుర్కోవాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

మీరు సాధించింది శూన్యం: పుతిన్‌

అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు బలగాలను కొనసాగించడం ద్వారా అమెరికా సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విమర్శించారు. ‘‘అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు ఉన్న అమెరికా సైన్యం.. అక్కడ కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు ప్రయత్నించింది. ప్రజలకు తమలాంటి నాగరికతను నేర్పించేందుకు యత్నించింది. ఫలితం మాత్రం శూన్యం. ఏ ప్రాంత ప్రజలపైనైనాసరే బయటి విధానాలను రుద్దడం అసాధ్యం’’ అని పుతిన్‌ బుధవారం పేర్కొన్నారు.

తాలిబన్లతో బ్రిటన్‌ చర్చలు

ఇప్పటికీ అఫ్గానిస్థాన్‌లోనే ఉన్న తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై బ్రిటన్‌ దృష్టిసారించింది. ఇన్నాళ్లూ తమకు సహకరించిన కొందరు అఫ్గానీలను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాలని కూడా యోచిస్తోంది. కతర్‌ రాజధాని దోహా వేదికగా తాలిబన్లతో బ్రిటన్‌ అధికారులు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన