భారత్‌తో ఒప్పందం కొనసాగింపు

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:39 IST

భారత్‌తో ఒప్పందం కొనసాగింపు

సింగపూర్‌ పార్లమెంటు తీర్మానం

స్థానికుల ఉద్యోగ భద్రతకు హామీ

సింగపూర్‌: భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి విఘాతం కలిగించేలా ప్రతిపక్షం ప్రతిపాదించిన తీర్మానాన్ని బుధవారం సింగపూర్‌ పార్లమెంటు తిరస్కరించింది. భారత్‌ నుంచి వస్తున్న వృత్తి నిపుణుల కారణంగా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని, అందువల్ల దీనిపై అత్యవసరమే చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం మాత్రం ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయడానికి అంగీకరించలేదు. చర్చ అనంతరం స్థానికుల ఉద్యోగాలు, జీవనోపాధికి భద్రత కల్పించేలా పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించింది.

స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా 2005లో భారత్‌-సింగపూర్‌ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందా (కాంప్రెహెన్షివ్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌-సీఈసీఏ)న్ని సమీక్షించాలంటూ ప్రతిపక్ష ప్రోగ్రెస్‌ సింగపూర్‌ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ ఒప్పందం కారణంగా సింగపూర్‌కు లబ్ధి కలిగిందో లేదో స్పష్టంగా తెలియదని, అందువల్ల దీనిపై సమీక్ష జరపాలని కోరింది. దీనిపై ఆర్థిక మంత్రి లారెన్స్‌ వాంగ్‌ సమాధానం ఇస్తూ ప్రపంచ పరిస్థితుల కారణంగా ఉపాధికల్పనలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని చెప్పారు. సింగపూర్‌లో తగినన్ని మానవ వనరులు లేని విషయాన్ని గుర్తించాలని కోరారు. విదేశీ నిపుణుల రాకపై ఆంక్షలు పెట్టినంత మాత్రాన ఉద్యోగులన్నీ స్థానికులకు వెళ్తాయన్న అభిప్రాయం సరికాదని చెప్పారు. ఉద్యోగాలపై ఆంక్షలు ఉండేలా నిబంధనలు పెడితే విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రారని, అప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లియోంగ్‌ మున్‌ వాయ్‌ మాట్లాడుతూ తాము విదేశీయులకు వ్యతిరేకం కాదని, వారి అవసరం ఎంతో ఉందని చెప్పారు. అయితే వారి రాక కారణంగా స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నదే ప్రధాన సమస్య అని తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి వాంగ్‌ స్పందిస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారిని తగిన విధంగా ఆదుకుంటామని చెప్పారు. కేవలం ఉద్యోగాల గురించే కాకుండా దేశ విలువల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. చివరకు స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు ఉండాలని సభ తీర్మానించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన