‘వెనుకటి తేదీ పన్ను’ రద్దుతో ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:40 IST

‘వెనుకటి తేదీ పన్ను’ రద్దుతో ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

భారత్‌-అమెరికా ఆర్థిక సదస్సులో రాజ్‌నాథ్‌

దిల్లీ: ‘వెనుకటి తేదీతో వర్తించే పన్ను’ను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం- పరిశ్రమల మధ్య విశ్వాసం పెరిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. దేశ ఆర్థిక పురోగతిని మరింత పెంచే వినూత్న ఆలోచనల్ని స్వీకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ‘భారత్‌-అమెరికా వాణిజ్య మండలి’ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. సైన్యానికి అవసరమైనవాటిని సంయుక్తంగా అభివృద్ధి పరచడంలో, కలిసి ఉత్పత్తి చేయడంలో రెండు దేశాల దిగ్గజ పరిశ్రమలకు ఎన్నో అవకాశాలున్నాయని రాజ్‌నాథ్‌ చెప్పారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇవి బాటలు వేస్తాయన్నారు. సంయుక్త భాగస్వామ్యం ద్వారా సాంకేతికత బదలాయింపుపై అమెరికా కంపెనీలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘ప్రపంచస్థాయి పెట్టుబడిదారుల్ని భారత్‌ ఇప్పుడు సాదరంగా ఆహ్వానిస్తోంది. కరోనా సవాళ్లు ఉన్నా 2022 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని అంచనా వేస్తున్నాం. ఆ తర్వాత దానికి కొనసాగించడమే సవాల్‌. ఈ దశాబ్దమంతా గతిశీల పురోగతిని సాధించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. పరిశ్రమలు, పెట్టుబడుల పరంగా ఏ సమస్యనైనా ప్రభుత్వంతో స్వేచ్ఛగా చర్చించండి’ అని రాజ్‌నాథ్‌ సూచించారు. గత రెండేళ్లలో తీసుకువచ్చిన పురోగమన విధానాల ఫలితంగా రక్షణ రంగ వృద్ధి ప్రస్థానం సమున్నతంగా సాగిపోతోందని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన