65% పట్టణాలకు మాస్టర్‌ప్లాన్లే లేవు

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:26 IST

65% పట్టణాలకు మాస్టర్‌ప్లాన్లే లేవు

నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో చట్టబద్ధంగా ఏర్పడిన పట్టణాల్లో సగానికి పైగా ఎలాంటి మాస్టర్‌ప్లాన్లు లేకుండానే విస్తరిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఆయా పట్టణాల వృద్ధి, మౌలిక వసతుల కల్పన గురించి ముందస్తుగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, ప్రత్యేక కార్యదర్శి కె.రాజేశ్వరరావు ‘దేశ పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణలు (రీఫామ్స్‌ ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ కెపాసిటీ ఇన్‌ ఇండియా) పేరుతో గురువారం ఇక్కడ ఓ నివేదిక విడుదల చేశారు. ‘పట్టణీకరణకు మాస్టర్‌ప్లాన్‌ అత్యవసరం. ఒక్కోసారి మాస్టర్‌ప్లాన్ల అమలులోనూ పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలోని 7,933 పట్టణ నివాసప్రాంతాల్లో 65% వాటికి ఎలాంటి మాస్టర్‌ప్లాన్లూ లేవు. దీనివల్ల పట్టణాల విస్తరణ అస్తవ్యస్తంగా మారి, పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. 2036 నాటికి దేశంలో 73% జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఏళ్లతరబడి జరుగుతున్న నగరాల విస్తరణ పెనుభారంగా మారి.. ఆ ఫలితాన్ని పేదలు, అట్టడుగువర్గాలు, జీవవైవిధ్యం, ఆర్థిక రంగాలు అనుభవిస్తున్నాయి’ అని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఈ దిశగా నివేదికలో పలు సిఫార్సులు చేసింది. ప్రస్తుతం దేశంలోని 75% పట్టణ జనాభా పది రాష్ట్రాల్లోనే ఉందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటని తెలిపింది. దేశంలో మురికివాడల్లో నివసించేవారిలో 70% ఆరు రాష్ట్రాల్లోనే ఉంటున్నారని, అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 15% మేర ఉందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన