ఐటీ చట్టం రెండు ఉప నిబంధనలపై స్టే

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:03 IST

ఐటీ చట్టం రెండు ఉప నిబంధనలపై స్టే

మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల్లోని రెండు సబ్‌ క్లాజుల అమలుపై గురువారం మద్రాసు హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిబంధనలు మీడియా స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్య విలువలను హరిస్తాయంటూ చేసిన ఆరోపణల్లో ప్రాథమికంగా వాస్తవం ఉందని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో కొత్త ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక విలువల స్మృతి) నిబంధనలు-2021ని అమల్లోకి తెచ్చింది. ఇందులోని 9వ నిబంధన కింద ఉన్న (1), (3) ఉప నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఉప నిబంధనల ప్రకారం వార్తలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీలను నియమిస్తుంది. ఇది మీడియాను నియంత్రించేదిగా ఉందంటూ కర్ణాటక సంగీతకారుడు టీ.ఎమ్‌.కృష్ణన్‌, 13 వార్తా సంస్థలతో కూడిన డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌, మరికొందరు దావాలు వేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్‌ ఆదికేశవుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. నియంత్రణ వ్యవస్థ ద్వారా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ పిటిషన్‌దారుల వాదనలో విషయం ఉందని అభిప్రాయపడింది. అయితే ఇలాంటి కేసే సుప్రీంకోర్టులో ఉందని, వచ్చే నెల మొదటి వారంలో అది విచారణకు రానుందని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆర్‌.శంకర్‌ నారాయణ్‌ తెలిపారు. దాంతో తదుపరి విచారణను అక్టోబరు చివరి వారానికి వాయిదా వేసింది.

తొలుత సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ సామాజిక మాధ్యమాలను, ఆన్‌లైన్‌ వార్తలను నియంత్రించేందుకు కొత్త చట్టం తీసుకువచ్చామని తెలిపారు. చట్టం నిషేధించిన అంశాలను ప్రచురించడం, వ్యాప్తి చేయడం కుదరదని చెప్పారు. ఈ నిబంధనలపై ఇదివరకే బాంబే హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. ఆ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన