ఎన్‌సీఎల్‌ఏటీ ఛైర్మన్‌ వివాదం పరిష్కారం

ప్రధానాంశాలు

Published : 17/09/2021 05:04 IST

ఎన్‌సీఎల్‌ఏటీ ఛైర్మన్‌ వివాదం పరిష్కారం

20 వరకు పదవిలో జస్టిస్‌ చీమా

అంగీకరించిన సీజేఐ ధర్మాసనం

దిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఛైర్మన్‌ వివాదం గురువారం పరిష్కారమయింది. ఛైర్మన్‌ జస్టిస్‌ అశోక్‌ ఇక్బాల్‌ చీమా పదవీ కాలం ఈ నెల 20 వరకు ఉండగా, ప్రభుత్వం ఈనెల 11న జస్టిస్‌ ఎం.వేణుగోపాల్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించింది. జస్టిస్‌ చీమా ముందుగానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. కేంద్రం సూచనల మేరకు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ పరిష్కారం చూపారు. తీర్పులు వెలువరించడానికి వీలుగా జస్టిస్‌ చీమా ఈ నెల 20 వరకు పదవిలో కొనసాగాలని సూచించారు. ఆ సమయంలో జస్టిస్‌ వేణుగోపాల్‌ సెలవుపై వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు అంగీకరిస్తూ ధర్మాసనం తగిన ఉత్తర్వులు జారీ చేసింది.

స్టే విధిస్తామని సీజేఐ హెచ్చరిక

తొలుత ఈ అంశంపై ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ ఒకసారి నియమించిన జస్టిస్‌ వేణుగోపాల్‌ను తొలగించడం బాగుండదని, అందువల్ల ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా జస్టిస్‌ చీమాను కొనసాగిస్తామని చెప్పారు. పదవీ విరమణ ప్రయోజనాలు పొందడానికి వీలుగా ఈ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో చిరాకుపడ్డ ధర్మాసనం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం కింద ఛైర్మన్లను తొలగించే అధికారం కేంద్రానికి ఉందని అటార్నీ జనరల్‌ చెప్పారు. అందుకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ.. అలా అయితే ఆ చట్టం అమలు చేయకుండా సుమోటోగా స్టే విధిస్తామని హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం నుంచి సూచనలు పొందేందుకు అరగంట సమయం కావాలని అటార్నీ జనరల్‌ అడిగారు. అనంతరం అన్ని అధికారాలతో జస్టిస్‌ చీమా పదవిని పునరుద్ధరించడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. పరిష్కారమార్గం చూపినందుకు ధర్మాసనం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన